iDreamPost
android-app
ios-app

బెంగాల్ లో ఘ‌ర్ వాప‌సీ ఎంద‌రు?

బెంగాల్ లో ఘ‌ర్ వాప‌సీ ఎంద‌రు?

ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ముందు నాటి రాజ‌కీయ వేడి ఇప్పుడు కూడా కొన‌సాగుతోంది. రెండు నెల‌ల్లోనే బెంగాల్ బీజేపీ లో సీన్ రివ‌ర్స్ అవుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కుమారుడు సుబ్రన్షు తో క‌లిసి టీఎంసీలో చేరారు. ఎన్నిక‌ల‌కు నాలుగేళ్లు ముందే అంటే 2017లోనే ఆయ‌న టీఎంసీ నుంచి బీజేపీలోకి జంప్ చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ సొంత‌గూటికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బెంగాల్ బీజేపీలో ఎవ‌రూ ఉండ‌ర‌ని పేర్కొన్నారు. 

ముకుల్ రాయ్ వ్యాఖ్య‌లు బీజేపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. టీఎంసీలో చేరేందుకు ఇంకెంద‌రు లైను లో ఉన్నారు.. బీజేపీలో ఎంద‌రు మిగులుతారు.. అనే ప్ర‌శ్న‌లను లేవ‌నెత్తుతున్నాయి. టీఎంసీ ఘన విజయం నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుదారులంతా మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

రెండేళ్లుగా రంకెలు

బీజేపీ మాతృపార్టీ అయిన జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రమయిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి 1982లో ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ, 1999 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీతో పొత్తు పెట్టుకునే వ‌ర‌కూ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేదు. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి 2 సీట్లు దక్కాయి. ఆ త‌ర్వాత 2016లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మూడే సీట్లు సాధించింది.

కానీ రెండు నెల‌ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 200 సీట్లను గెల్చుకుంటామనే ధీమాతో బరిలోకి దిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 సీట్లకు గాను 18 సీట్లు గెల్చుకోవడంతో బీజేపీలో ఆ భరోసా ఏర్పడింది. దీంతో ఎన్నికల వ్యూహరచనలో సాటిలేని నేతగా పేరొందిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వయంగా బెంగాల్ ఎన్నికలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. దీంతో అక్క‌డ రెండేళ్లుగా బీజేపీ ఉదృతంగా ప్రచారం చేసింది.

భ‌విష్య‌త్ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండానే అని అత్య‌ధిక ధీమాతో దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఆ పార్టీ అగ్ర నేత‌లు అంద‌రూ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ టీఎంసీ నేత‌ల‌కు ద‌డ పుట్టించారు. ఆరోప‌ణ‌లు, ఆందోళ‌ణ‌లు, ఘ‌ర్ష‌ణ‌లు.. ఇలా రాజ‌కీయాన్ని వేడెక్కించారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా త‌మకు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండాలంటే బీజేపీలో చేరాల‌ని భావించారు. చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

రెండు నెల‌ల్లోనే ఎన్నో మార్పులు

క‌మ్యూనిస్టుల కోట‌లో మ‌మ‌త అధికారం చేప‌ట్టాక కొంద‌రు సీపీఎం, సీపీఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలోకి చేరారు. వారిలో చాలా మంది గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ దూకుడు చూసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీపీఐ ఎమ్మెల్యే అశోక్ దిండా, సీపీఎం ఎమ్మెల్యే తపషి మండల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ త‌దిత‌రుల‌తో పాటు 50 మందికి పైగా టీఎంసీ నాయ‌కులు బీజేపీలో చేరారు. అందులో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంద‌రూ బీజేపీలోనే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని భావించారు. కానీ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ బోల్తా ప‌డింది. టీఎంసీ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెండు నెల‌ల్లోనే ఎన్నో మార్పులు చేసుకుంటున్నాయి. బీజేపీలో చేరిన వారంతా ఇప్పుడు ఘ‌ర్ వాప‌సీ అంటున్నారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 33 మంది టీఎంసీలో చేరబోతున్నారని టాక్ నడుస్తోంది. తాజాగా టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్ వ్యాఖ్య‌లు ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి.

వేట మొద‌లైంది..
గ‌త బెంగాల్ ఎన్నికల్లో 294 సీట్ల బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ఏకంగా 213 సీట్లు గెలిచింది. బీజేపీ 77 సీట్లను కైవసం చేసుకుంది. వారిలో ఇప్పుడు ఎంత మంది బీజేపీలో ఉంటార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో బీజేపీని లేకుండా చేసే గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో మ‌మ‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో కాషాయ కండువా కనబడకుండా చేసేందుకు ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. బీజేపీలో చేరిన నేతలకు ఘర్‌వావసీ తప్పకుండా ఉంటుందని సీఎం మమతా బెనర్జీ చాలా సంద‌ర్భాల్లో సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పుడు అది మొద‌లైంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక‌పై టీఎంసీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.