iDreamPost
android-app
ios-app

రిస్కీ పాయింట్ తో కొత్త కుర్రాడు

  • Published Oct 04, 2022 | 4:19 PM Updated Updated Oct 04, 2022 | 4:19 PM
రిస్కీ పాయింట్ తో కొత్త కుర్రాడు

రేపు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి , కింగ్ నాగార్జునలతో తలపడేందుకు సిద్ధపడిన కొత్త కుర్రాడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం చాలా తక్కువ అంచనాలతో థియేటర్లలో అడుగు పెడుతోంది. మాములుగా అయితే వేరే నిర్మాత సాహసించేవాడు కాదు కానీ స్టార్ బ్యాకప్ ఉన్న సితార సంస్థ కావడంతో రిలీజ్ సులభమయ్యింది. నిడివి కేవలం 1 గంట 58 నిముషాలు మాత్రమే ఉండటం ఈ సినిమాకు కలిసివచ్చే కీలక అంశం. అందులోనూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ దట్టించారు కాబట్టి కుటుంబ ప్రేక్షకులను పండగ రోజు లాగొచ్చనే ప్లాన్ బాగానే వేసుకున్నారు. ఒకవేళ గాడ్ ఫాదర్. ది ఘోస్ట్ లు హిట్ అయినా వాటికి టికెట్లు దొరకని వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అవ్వాలన్న ఆలోచనా కావొచ్చు.

వీటిని కాసేపు పక్కనపెడితే స్వాతిముత్యంలో చాలా సెన్సిటివ్ గా అనిపించే స్పెర్మ్ డొనేషన్(వీర్య దానం)కాన్సెప్ట్ ని తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇలాంటి పాయింట్లు సాధారణంగా మన ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ కావు. బాలీవుడ్ లో ఈ సమస్య లేదు. విక్కీ డోనర్ అక్కడ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. దీన్ని తెలుగులో ఏరికోరి మరీ సుమంత్ నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేశాడు కానీ అది మరీ దారుణంగా బోల్తా కొట్టింది. క్యాస్టింగ్ సమస్యలతో పాటు కంటెంట్ తెరకెక్కించిన విధానం జనానికి నచ్చకపోవడంతో తిరస్కారం ఎదురయ్యింది. అదే సమస్యని ఇంకో యాంగిల్ లో లవ్ స్టోరీకి ముడిపెట్టి ఈ స్వాతిముత్యంని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది

ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు సోలోగా వస్తే బాగుండేది కానీ ఇలా దిగ్గజాల మధ్య రేస్ లో దిగడం ఎంతైనా సాహసమే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడంతో పాటు ప్రమోషన్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. కేవలం 4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో వస్తున్న స్వాతిముత్యంకి పర్లేదు బాగానే ఉందనే మాట వచ్చినా చాలు ఈజీగా రికవరయ్యే ఛాన్స్ పెరుగుతుంది. పెద్ద మొత్తం కాదు కాబట్టి మొదటి రెండు రోజులు వీక్ గా ఉన్నా తర్వాత పికప్ అవ్వొచ్చు. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన స్వాతిముత్యంకి అలనాటి క్లాసిక్ కమల్ హాసన్ టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి దానికెంతవరకు న్యాయం చేకూరుస్తారో వేచి చూడాలి. లక్ష్మణ్ కె కృష్ణ దీనికి దర్శకుడు