iDreamPost
iDreamPost
మాములుగా పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద తలపడుతున్నప్పుడు చిన్న చిత్రాల నిర్మాతలు రిస్క్ చేసేందుకు భయపడతారు. అందులోనూ జనం చాలా సెలెక్టివ్ గా థియేటర్లకు వస్తున్న తరుణంలో ఏ మాత్రం తొందరపడినా ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థే ఇటీవలే హ్యాపీ బర్త్ డే, ఈ అమ్మాయి మీకు చెప్పాలి లాంటి మీడియం బడ్జెట్ మూవీస్ తోనూ విపరీత నష్టాలు చవిచూడక తప్పలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వాటిలో ప్రధాన మైనస్ కాగా కంటెంట్ మరీ తక్కువ స్థాయిలో ఉండటంతో ఆడియన్స్ తిరస్కరించారు. అందులోనూ పోటీ టైంలో రావడం కూడా ఇవి డ్యామేజ్ కావడానికి కారణమయ్యింది.
కానీ బెల్లంకొండ గణేష్ ను స్వాతిముత్యంతో హీరోగా పరిచయం చేస్తున్న సితార సంస్థ మాత్రం ఎందుకనో మరీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ తలపడుతున్న అక్టోబర్ 5నే తమ సినిమాను రిలీజ్ చేసే విషయంలో వెనుకడుగు వేయడం లేదు. ఆ రెండూ పెద్ద బ్యానర్లు డిస్ట్రిబ్యూటర్ల అండతో వస్తున్నాయి. స్వాతిముత్యం ప్రొడ్యూసర్లకు సైతం నెట్ వర్క్ ఉన్నప్పటికీ అది స్క్రీన్ కౌంట్ విషయంలో కొంత ఉపయోగపడుతుంది కానీ కంటెంట్ గురించో టాక్ గురించో కాదు. అలా అని ఈ సినిమా మరీ ఎక్స్ ట్రాడినరీగా అనిపించడం లేదు. టీజర్ చూశాక కూల్ ఎంటర్ టైనర్ అనిపించిందే తప్ప చిరు నాగ్ కన్నా బెస్ట్ ఛాయస్ అనే ఫీలింగ్ కలగలేదు.
ఈ ఒక్క కోణంలోనే రిస్క్ లేదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మెగా అండ్ కింగ్ సినిమాల వెనుక ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి, ఏషియన్ సునీల్ నారంగ్ లాంటి బడా హస్తాలున్నాయి. పైగా ఓపెనింగ్స్ చాలా కీలకం కాబట్టి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. ఈ హడావిడిలో స్వాతిముత్యంని పట్టించుకోవాలంటే ఎక్స్ ట్రాడినరీ మ్యాటర్ ఉండాలి. అసలే దానికి వారం ముందు ధనుష్ నేనే వస్తున్నా, మణిరత్నం పొన్నియన్ సెల్వన్1లు వచ్చి ఉంటాయి. వీటిలో ఏది మంచి టాక్ తెచ్చుకున్నా అదో ఇబ్బంది. మొత్తానికి పద్మవ్యోహాన్ని తలపిస్తున్న టాలీవుడ్ దసరా పోటీలో కొత్తగా పరిచయమవుతున్న గణేష్ ఎలా ఎదురుకుంటాడో చూడాలి