రాజుల సొమ్ము రాళ్ళ పాలు…ఇది పాత సామెత. మరి కొత్త సామెతేంటో తెలుసా…ప్రజల సొమ్ము ప్రముఖుల పాలు..! అవును బ్యాంకులు ప్రజల నుంచి వడ్డీల ద్వారా…ప్రభుత్వం నుంచి రీక్యాపిటలైజేషన్ (ఇదీ ప్రజల డబ్బే)ద్వారా అందుకున్న డబ్బులను బడాబాబుల ఖాతాల్లో వేస్తున్నాయి. రైతుల నుంచి విద్యార్థుల వరకూ ఎవర్నీ విడిచిపెట్టకుండా అందరి దగ్గరా ముక్కు పిండి రుణాలను వసూలు చేసే బ్యాంకులు…విచిత్రంగా బడా పారిశ్రామిక వేత్తలు, వ్యక్తుల దగ్గరకొచ్చేసరికి ఎందుకో మూగబోతున్నాయి. తాజాగా ఆర్‌బీఐ ఉద్దేశపూర్వక ఎగవేతదారులైన వ్యాపారవేత్తలకు 2019, సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు రూ.68,607 కోట్లు రైటాఫ్ చేశాయని వెల్లడించింది. దీంతో విస్తుపోవడం దేశ ప్రజల వంతైంది.
వెలుగులోకి ఇలా….
ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం ద్వారా టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను కోరడంతో ఆర్బీఐ సదరు వివరాలను వెల్లడించింది. కాగా, ఇదే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జెవాలలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జాబితాలో మోదీకి సన్నిహితులైన మెహుల్ చోస్కీ, రాందేవ్ బాబా తదితరులు ఉన్నందునే తాను పార్లమెంటులో అడిగినప్పటికీ ఆర్థిక మంత్రి వివరాలను ప్రకటించలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పేదలకు పెట్టేందుకు మనసురావట్లేదు కానీ, బడాబాబులకు దోచిపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఘాటుగా స్పందించారు. రాహుల్‌గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రభుత్వం ఎవరి రుణాలను రద్దు చేయలేదని రుణాల రికవరీ పక్రియ కొనసాగుతోందన్నారు. రైటాఫ్, వేవాఫ్‌లకు తేడా తెలుసుకోకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. 2009–2014 మధ్య కమర్షియల్ బ్యాంకులు రూ.1,45,226 రైటాఫ్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
రైటాఫ్ వర్సెస్ వేవాఫ్
ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసం ఉంది. రైటాఫ్ విధానంలో బ్యాంకులు రుణాలను రద్దు చేయకపోయినప్పటికీ…బ్యాలెన్స్ షీట్ నుంచి సదరు రుణం వివరాలను తొలగిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి బ్యాంకు నుంచి రూ.లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడనుకుందాం…. సదరు లోన్ బ్యాంకుకు అసెట్(ఆస్తి) అవుతుంది, దానిపై వచ్చే వడ్డీ ఆదాయం అవుతుంది. లోన్ తీసుకున్న వ్యక్తి ఇన్‌స్టాల్‌మెంట్‌లు సక్రమంగా చెల్లించినంత కాలం సదరు రుణం బ్యాంకుకు అసెట్‌గానే ఉంటుంది. కానీ అలా జరగని పక్షంలో బ్యాంకులు నిర్దిష్ట సమయం తర్వాత ఆయా రుణాలను ఎన్‌పీఏ(Non Profitable Assets,నిరర్ధక ఆస్తులు )లుగా ప్రకటిస్తాయి. నాలుగేళ్ల దాటిన ఎన్‌పీఏలను ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రైటాఫ్ చేస్తాయి. అనగా ఆయా రుణాలకు భవిష్యత్ పరంగా విలువ లేదని…వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదని బ్యాంకులు తీర్మానించటం. రైటాఫ్ చేసినప్పటికీ రుణాల రికవరీ ప్రయత్నాలు చట్టం పరిధిలో కొనసాగుతూనే ఉంటాయి. ఇక వేవాఫ్ విషయానికొస్తే బ్యాంకులు రుణ రికవరీ ప్రయత్నాలు చేయవు…ఆయా రుణాలను పూర్తిగా రద్దు చేస్తాయి. రైతులు తీవ్ర పంటనష్టం ఎదుర్కొన్నప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు, ఇతర విపత్తుల సమయంలో బ్యాంకులు వేవాఫ్‌ను ప్రకటిస్తాయి.
రైటాఫ్ ఎందుకు…?
బ్యాంకులు లక్షలు, వేల కోట్ల రూపాయలను ఎందుకు రైటాఫ్ చేస్తాయి. దీనివల్ల బ్యాంకులకు లాభం ఏమిటీ అనే సందేహం అందరికీ వచ్చేదే…! ఎన్‌పీఏలు పెరిగిపోవడం వల్ల బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇచ్చిన రుణాల నుంచి ఆదాయాలు(అసలు కూడా) రాకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. అదే సమయంలో బ్యాంకులు తమ అసెట్స్(ఎన్‌పీఏలతో సహా)పై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపశమన చర్యల్లో బ్యాంకులు ఎన్‌పీఏలను బ్యాలెన్స్ షీట్ నుంచి తప్పించి…వాటిపై ట్యాక్స్ వ్యయాన్ని తగ్గించుకుంటాయి. అయితే దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గి..అంతిమంగా ప్రజలపై దుష్పభ్రావం పడుతుంది.
రైటాఫ్ పెద్ద స్కామ్…
బ్యాంకుల హెల్త్‌ను(పనితీరు) దృష్టిలో పెట్టుకొనే రైటాఫ్ ప్రక్రియ ముందుకొస్తుందని చెప్తున్నప్పటికీ…దీని వల్ల లక్షలు,వేల కోట్ల ఆవిరైపోతుండటాన్ని మాత్రం అందరూ ఖండించాల్సిందే. ఈ దుస్థితికి బ్యాంకులతోపాటు ప్రభుత్వమూ బాధ్యత వహించాలి. సాక్షాత్తూ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి రైటాఫ్‌ను పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. బ్యాంకులు కేవలం బడాబాబులకే వేల కోట్ల రుణాలను రైటఫ్ చేస్తున్నాయని…చిన్న వాళ్ళు పొందిన రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని విమర్శించారు. 2014 ఏప్రిల్– 2018 ఏప్రిల్ మధ్య బ్యాంకులు రూ.3,16,500 కోట్ల రుణాలను రైటాఫ్ చేయగా వాటి నుంచి కేవలం రూ.44,990 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని ఆయన వెల్లడించారు.
రైటాఫ్ జాబితాలోని ప్రముఖులు…..
’విల్‌ఫుల్ డిఫాల్టర్స్’ జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ. 5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజయ్ ఝున్ ఝన్ వాలాకు చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఆర్‌ఇఐ ఆగ్రో లిమిటెడ్, (రూ. 4314 కోట్లు), జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ ( రూ.4000 కోట్లు) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.2,850 కోట్లతో కాన్పూర్ ఆధారిత కంపెనీ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ జాబితాలో ఉంది. వీరితో పాటు బాబా రామ్‌దేవ్–ఆచార్య బాలకృష్ణ గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండోర్ (రూ.2,212 కోట్లు), రూ.1,943 కోట్లతో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ డిఫాల్టర్ల జాబితాలో వుంది.