అమ్మా ఆకలేస్తుంది..టూ మినిట్స్ ఆగరా నీకు మ్యాగీ నూడుల్స్ తయారు చేసి ఇస్తాను.. పండగ వస్తుంది కదా డాడీ స్వీట్ మ్యాజిక్ కి వెళ్లి స్వీట్స్ తీసుకురా నాన్న.. నేటి కాలంలో తరచుగా వినబడే మాటలు..
కానీ 90ల్లో మాత్రం అమ్మా ఆకలి అనగానే ఒక 5 నిమిషాలు ఆగు నాన్న నీకు సేమ్యా ఉప్మా చేసి ఇస్తాను..ఈరోజు పండుగ కదా సేమ్యా పాయసం చేయమ్మా ప్లీజ్ .. ఇలా ఉండేవి అప్పటి మాటలు.. ఇప్పటికీ ఆకలేస్తే సేమ్యా ఉప్మా, పండగొస్తే సేమ్యా పాయసం చేసుకుని తినే కుటుంబాలు అనేకం ఉన్నాయి. తెలుగు ప్రజలు ఇష్టంగా తినే దైనందిన ఆహారంగా సేమ్యాను మార్చిన బాంబినో గ్రూప్ చైర్మన్ కిషన్ రావు పేరు అందరికీ తెలియకపోయినా ఆయన తయారుచేసే బాంబినో సేమ్యా మాత్రం అందరికి సుపరిచితమే. కాగా బాంబినో గ్రూప్ అధినేత కిషన్ రావు(85) గుండె పోటు కారణంగా మరణించడం కంపెనీకి మాత్రమే ఆహార ప్రియులకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు.
తెలుగింటి లోగిళ్ళలో ఉదయం అల్పాహారంగా పండుగ మాధుర్యాన్ని రుచి చూపే పాయసంగా మారే సేమ్యాను తయారుచేసే బాంబినో ఇండస్ట్రీస్ ను ఎం.కిషన్ రావు 1982 లో స్థాపించారు. బాంబినో పేరుతోనే నాణ్యమైన సేమ్యాను ప్రజల్లోకి తీసుకెళ్లి సేమ్యా అంటేనే బాంబినో బాంబినో అంటేనే సేమ్యా అనేంతగా మంచిపేరును కిషన్ రావు సంపాదించారు. కొంతకాలం అనంతరం వినియోగదారులలో వస్తున్న మార్పును వారి జీవన శైలిలో రాబోయే మార్పులను అంచనా వేస్తూ సేమ్యా మాత్రమే కాకుండా ఇతర “రెడీ టు ఈట్” ఆహార ఉత్పత్తులను కూడా బాంబినో గ్రూప్ ప్రవేశపెట్టి విజయం సాధించింది. కాలానికి అనుగుణంగా రాబోయే మార్పులను పసిగట్టి బాంబినో సంస్థ సాధించిన విజయం వెనుక కిషన్ రావు ముందు చూపు అర్థం అవుతుంది.
తన ముందు చూపుతో బాంబినో కంపెనీని విజయపథంలో నడిపి సేమ్యాతో తెలుగు ప్రజల హృదయాలు గెలిచిన కిషన్ రావు గుండె పోటుతో మృతి చెందడం సంస్థతో పాటు తెలుగు ప్రజలకు తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. .