iDreamPost
android-app
ios-app

Kuppam, Chandrababu, TDP – కుప్పం కాపాడుకోవడమే ఇప్పుడు బాబు ప్రథమ కర్తవ్యం

  • Published Jan 02, 2022 | 4:25 AM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Kuppam, Chandrababu, TDP – కుప్పం కాపాడుకోవడమే ఇప్పుడు బాబు ప్రథమ కర్తవ్యం

ఢిల్లీలో చక్రం తిప్పానని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు గల్లీలో తన కుర్చీ కాపాడుకోవడానికి కుస్తీలు పడుతున్నారు. జాతీయ స్థాయి నేతనని ఆయనకు ఆయనే పదవి ప్రకటించుకుంటారు. కానీ ఇప్పుడు కుప్పంలో తన ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ అని గొప్పలకు పోతారు. కానీ ఏడుసార్లు గెలిచిన చోట ఇప్పుడు ఎదురీతలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆంద్రప్రదేశ్ లో అధికారం కోసం పోటీ పడాల్సిన నేత ముందు తన కుప్పం సీటుని కాపాడుకోవడం ఎలా అన్నదే ఆలోచిస్తున్నారు. దాంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత పరిస్థితి చర్చనీయాంశం అవుతోంది.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తనకు ఓట్లేసిన ఓటర్లను కనీసం గుర్తించిన పాపాన పోలేదు. కుప్పం వైపు కన్నెత్తి చూసింది లేదు . సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకి వెళ్లి సేద తీరడమే తప్ప కుప్పం వాసుల కష్టాలను పట్టించుకోలేదు. చివరకు కుప్పం పంచాయతీకి మునిసిపాలిటీ హోదాని కూడా జగన్ ప్రభుత్వమే కల్పించాల్సి వచ్చిందంటే ఆయన ఏమేరకు సొంత నియోజకవర్గానికి ప్రాధాన్యతనిచ్చారో అర్థమవుతుంది. దాని ఫలితమే ఇటీవల జగన్ కి కుప్పం వాసులు జై కొట్టే పరిస్థితి వచ్చింది. వరుసగా వైఎస్సార్సీపీకి విజయపరంపర సాగుతోంది. టీడీపీ పునాదులే చెల్లాచెదురయ్యే స్థితి దాపురించింది.

దాంతో రాబోయే ఎన్నికల్లో సొంత సీటులోనే చంద్రబాబుకి చుక్కెదురు తప్పదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. గడిచిన ఎన్నికల్లోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి, దివంగత చంద్రమౌళి గట్టిపోటీనిచ్చారు. రెండు మూడు రౌండ్ల వరకూ ఓట్ల లెక్కింపులో చంద్రబాబు వెనుకబడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న చంద్రమౌళి తనయుడు భరత్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చొరవతో కుప్పంలో చంద్రబాబు పరిస్థితి పేలవంగా మారుతోంది. ఈ తరుణంలో కుప్పం కాపాడుకోలేకపోతే చంద్రబాబు పరువు బజారుపాలవుతుందనే విషయం బాగా బోధపడినట్టుంది. దాంతో కుప్పం పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి ఆయన ప్రాధాన్యతనిస్తున్నారు.

ఎక్కువ సమయం కేటాయిస్తూ కుప్పంలో దిగజారుతున్న తన పరస్థితిని కాపాడుకోవడానికి యత్నిస్తున్నారు.

సీఎంగా ఉన్నప్పుడు గానీ, గతంలో విపక్ష నేతగా ఉన్న సమయంలోనూ కుప్పం నియోజకవర్గానికి పెద్డగా ప్రాధాన్యతనివ్వని చంద్రబాబు ఇటీవల పదే పదే పరుగులు పెడుతున్నారు. గడిచిన మూడు నెలల్లో రెండు మార్లు మూడేసి రోజుల చొప్పున కుప్పంలోనే ఆయన మకాం వేయాల్సి వచ్చింది.ఈ జాగ్రత్తలు చూస్తుంటేనే చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో ఉన్నట్టు తేటతెల్లమవుతోంది.

తన సొంత సీటుని కాపాడుకునేయత్నంలో ఆయన కృషి చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే తనయుడు నారా లోకేష్ కి మంగళగిరిలో జరిగిన సన్మానం చంద్రబాబుని కలవరపెడుతోంది. వచ్చే ఎన్నికల కోసం మంగళగిరిలో లోకేష్ ప్రచారం ప్రారంభించినా ఫలితం గ్యారంటీ లేదు. దాంతో కుప్పంలో కూడా తనకు అదే స్థితి ఎదురయితే చివరి దిశలో తీవ్ర పరాభవం అవుతుందనే బెంగ బాబులో స్పష్టంగా ఉంది. దాంతో ఏదోటి చేసి కుప్పం సీటులో గట్టెక్కాలనే సంకల్పానికి వచ్చారు. కుప్పం వదిలేసి మరోస్థానం ఎంచుకుంటే ముందే ఓటమి అంగీకరించినట్టవుతుంది కాబట్టి ఏదో రకంగా కుప్పంలో ఓటమి గండం నుంచి బయటపడాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఇన్ని అవస్థలు పడుతుంటే రాష్ట్రంలో ఇక ఆపార్టీని కాపాడే నాథుడెవరన్నది అంతుబట్టని విషయంగా మారింది. చంద్రబాబు కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, లోకేష్ మంగళగిరికే పరిమితం కావాల్సిన స్థితిలో టీడీపీకి దిక్కెవరన్నది టీడీపీ నేతలను కలవరపరుస్తోంది.జగన్ దూకుడు ముందు ప్రధాన నేతలే పట్టుకోసం ప్రయాసపడుతున్న వేళ తమకు అండగా ఉండే నేతలెవరన్నది అర్థంకాని విషయంగా మారింది. దాంతో విపక్ష టీడీపీ నేతలు ఈ పరిస్థితిని చూసి మరింత ఆందోళనకు గురవుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలను గమనిస్తూ కలవరపడుతున్నారు.