Idream media
Idream media
కరోనా నేపథ్యంలో ఆయా దేశాలలో విధించిన లాక్‌డౌన్‌తో చాలా దేశాల క్రికెట్ బోర్డులు నష్టాలపాలై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వచ్చే అక్టోబర్,నవంబర్ మాసాలలో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ జరగనుంది. ఐసీసీ కప్ ముగిసిన వెంటనే భారత్ కంగారులతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అయితే ప్రపంచ కప్‌తో పాటు భారత పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్ పర్యటన కోసం ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 50 మిలియన్ డాలర్ల అప్పుచేసింది.
ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆటగాళ్ల వేతనాలలో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ క్రికెటర్‌లకి స్పష్టం చేశాడు. పైగా క్రికెట్ ఆస్ట్రేలియా దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తొలగించింది. జూన్ 30 వరకు కేవలం 20 శాతం మందికి మాత్రమే జీతాలు ఇవ్వనుంది. కరోనా కారణంగా అని మ్యాచ్‌లు రద్దు కావడంతో ఇప్పటివరకు 300 మిలియన్ డాలర్లకుపైగా క్రికెట్ ఆస్ట్రేలియా నష్టపోయింది. ఈ ఆపత్కాలంలో ఆసీస్‌లో భారత పర్యటన రద్దు అయితే క్రికెట్ ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో దివాళా తీసే పరిస్థితులు నెలకొంటాయి. ఆటగాళ్లకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండదు.
ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా గట్టెక్కాలో అర్థం కాక ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆసీస్ సంచలన బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ “రాబోవు నాలుగైదు నెలలలో తమ దేశంలో భారత్ క్రికెట్ జట్టు పర్యటిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ ఈ పర్యటన రద్దు అయితే పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అయితే తమ దేశంలో ఉన్న మెరుగైన ఆరోగ్య వ్యవస్థ వలన కరోనాను నియంత్రించామని” అభిప్రాయపడ్డాడు.
గత ఏడాది తొలిసారిగా కంగారూ గడ్డపై భారత్ 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలుపొందింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించింది. ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఆసీస్ టాప్ ర్యాంకును చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.