Idream media
Idream media
దాదాపు రెండు నెలలపాటు సాగిన రాజస్థాన్ రాజకీయ సంక్షోభం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ఛీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మరో 18 మంది ఎమ్మెల్యేలతో గెహ్లోత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మొదలైన రాజకీయ క్రీడ ఎత్తులు, ఎత్తులు, ఆరోపణలు, విమర్శలు, కుట్రలు, కోర్టుల్లో సాగి.. చివరకు ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాఫీగా ముగిసింది.
ఈ రోజు ప్రారంభమైన అపెంబ్లీ సమావేశంలో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య వాగ్వాదాలతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ ప్రారంభం అయిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అనంతరం సభను ఈ నెల 21వ తేదీకి స్పీకర్ వాయిదా వేశారు.
గెహ్లోత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ తిరిగి సొంతగూటికి చేరడంతో ఎలాంటి సంచలనాలు, వ్యూహ ప్రతివ్యూహాలు లేకుండానే విశ్వాస పరీక్ష సుఖాంతమైంది. అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజులు ముందు సచిన్ పైలెట్‌తో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశం అయి వివాదం, డిమాండ్ల పరిష్కారానికి ముగ్గురు నేతలతో కమిటీ వేయడంతో ఇప్పటి వరకూ ఉప్పు, నిప్పూగా ఉన్న అశోక్ గెహ్లోత్, సచిన్ పైలెట్‌లు చేయి చేయి కలిపారు.
విశ్వాస పరీక్ష తర్వాత మాట్లాడిన సచిన్.. రాష్ట్రంలో ప్రజల కోసం కలసి పని చేస్తామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు ఈ రోజు పటాపంచలయ్యాయని వ్యాఖ్యనించారు.