Idream media
Idream media
తూర్పు ఆలయాల చైర్మన్ పోస్టు నుంచి తొలగింపు
ఆ పదవిలో సంచయిత నియామకం
మాజీ కేంద్రమంత్రి, విజయనగరం పూసపాటి జమీందారి వంశీకుడు అశోక్ గజపతి రాజుకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పదవుల నుంచి తొలగించిన ప్రభుత్వం నేడు ఆయన్ను తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ఆలయాల చైర్మన్ గానూ తొలగించింది. ఆ పదవిలో అశోక్ అన్నయ్య దివంగత ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజును నియమించింది.
అశోక్ పూర్వీకులు ఏర్పాటు చేసిన మహారాజ అలక్ నారాయణ గజపతి సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్)కు మూడేళ్ళ కిందటి వరకు ఆనంద్ గజపతి చైర్మన్ గా ఉండేవారు . ఆయన మరణానంతరం అశోక్ ఆ పదవిలోకి వచ్చారు. ఈ ట్రస్ట్ కింద ఉత్తరాంధ్ర తో బాటు తూర్పు గోదావరి జిల్లాలో సింహచలంలోని వరాహ నరసింహస్వామి ఆలయంతో బాటు 108 ఆలయాలు ఉన్నాయి. విజయనగరంలో పలు విద్యాసంస్థలున్నాయి. ఇంకా 14,500 ఎకరాల భూములు కూడా ఈ ట్రస్ట్ ఆధీనంలో ఉన్నాయి. ఇంకా ట్రస్ట్ పేరుమీద బ్యాంకుల్లో రూ.110 కోట్ల డిపాజిట్లు, సింహాచలం ఆలయం పేరుమీద రూ.123 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
అయితే ఈ ఏడాది మొదట్లో అశోక్ గజపతి రాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవితోబాటు సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగిస్తూ ఆ పదవిలో సంచయిత గజపతిరాజును నియమించింది. అయితే నేడు తూర్పు గోదావరి జిల్లాలోని ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి కూడా తొలగిస్తూ, ఆ పదవిలో కూడా సంచయితను నియమించారు. దీనిపై అశోక్ తీవ్రంగా స్పందిస్తూ అర్థరాత్రి తప్పుడు జీవోలు ఇస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా అశోక్ చైర్మన్ గా ఉన్నపుడు ట్రస్ట్ లో పలు అక్రమాలు జరిగాయని, టిడిపి హయాంలో భూములను అమ్ముకుని అశోక్ గజపతి సొంతానికి వాడుకున్నారని పలుమార్లు సంచయిత ఆరోపించారు.