ఎట్టకేలకు షారుఖ్ కొడుక్కి బెయిల్.. కానీ కండిషన్స్ అప్లై!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి అరెస్ట్ చేసింది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీకి హాజరయ్యేందుకు ఆర్యన్ ఖాన్ వెళ్తున్న క్రమంలో క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సిబి దాడి చేసి అక్కడ ఉన్న ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాను అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు కానీ ఆర్యన్‌పై ఎన్‌సిబి మాత్రం చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్‌లో ఆర్యన్ భాగమై ఉండవచ్చని ఎన్‌సీబీ చెబుతోంది. అలాంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌కు భారీ ఉపశమనం లభించింది. వరుసగా మూడు రోజుల పాటు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు గురువారం నాడు ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఆర్యన్ ఖాన్ పాస్‌పోర్ట్‌ను కోర్టు ముందు సరెండర్ చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండా మరియు ఎన్‌సిబికి సమాచారం ఇవ్వకుండా ఆర్యన్ ఖాన్ దేశం నుండి బయటకు వెళ్లకూడదు. అలాగే ఆర్యన్ ఇతర నిందితులను ఏ విధంగానూ సంప్రదించకుండా ఉండాలి. అంతేకాక కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఆర్యన్ ఖాన్ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకూడదు. ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కూడా బెయిల్ పొందారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 25 రోజుల తర్వాత బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ కు బెయిల్ మంజూరు చేస్తూ హై కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాత్రికి ఆర్యన్ ఖాన్ జైలులోనే ఉంటాడు. కోర్టు ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందిన తర్వాతే ఆర్యన్, అర్బాజ్, మున్మున్ జైలు నుంచి బయటకు రాగలుగుతారు. ముగ్గురూ శుక్రవారం లేదా శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆర్యన్ ఖాన్ లాయర్లు మూడు ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు బెయిల్ పొందగలిగారు. గతంలో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు రెండుసార్లు తిరస్కరించింది.

వేడుకలకు దూరంగా
డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆర్యన్ ఖాన్ చాలా కుటుంబ వేడుకలకు దూరమయ్యాడు. ఆర్యన్ ఖాన్ జైల్లో ఉండటంతో గౌరీ ఖాన్ పుట్టినరోజు, షారుఖ్ ఖాన్-గౌరీల వివాహ వార్షికోత్సవం సైతం మన్నత్‌లో జరగలేదు. అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2)న ఆర్యన్ ఫ్యామిలీతో కలవనుండడం వారి అభిమానులు సంతోషించాల్సిన విషయమే. ఇక బెయిల్ రావడంపై సెలబ్రిటీలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.

కిరణ్ గోసావీ అరెస్ట్
మరో పక్క ఆర్యన్‌ ఖాన్‌తో కలిసి ఎన్‌సీబీ కార్యాలయంలో సెల్ఫీ దిగిన కిరణ్ గోసావి అనే ప్రైవేట్ డిటెక్టివ్ ని మోసం కేసులో కోర్టు 8 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో కిరణ్ గోసావి వివాదాస్పద సాక్షిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధం లేని 2018లో నమోదైన చీటింగ్ కేసులో పూణె పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Show comments