Idream media
Idream media
పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదనేలా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు అంటూ.. నూతన యాప్‌ను తీసుకొచ్చారు. పూర్తిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కనుసన్నల్లో, అత్యంత గోప్యంగా తయారు చేయించిన ఈ యాప్‌ను ఎస్‌ఈసీ ఈ రోజు ఆవిష్కరించింది. ఆ యాప్‌కు ఈ–వాచ్ అని పేరు పెట్టారు.
యాప్ తయారీ, పని తీరు తదితర వివరాలను రాష్ట ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు వెల్లడించారు. ఈ – వాచ్ యాప్‌ను ఎన్నికల పర్యవేక్షణ కోసం తీసుకొచ్చామని తెలిపారు. యాప్‌ను పారదర్శకంగా తయారు చేయించామని వెల్లడించారు. జియో సహకారంతో ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఫిర్యాదులను కేటగిరిల వారీగా విభజించి, పరిష్కరిస్తామని పేర్కొన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే.. సదరు ఫిర్యాదుదారుడిని ఫోన్ నంబర్ ద్వారా గుర్తిస్తామని వివరించారు.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అంతా తానై వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఈ యాప్‌ను తీసుకొస్తున్నామని ఇటీవల వెల్లడించారు. పోలింగ్ పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేసే వెబ్‌కాస్టింగ్, సమస్యలు, ఫిర్యాదులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న నిఘా యాప్‌ను కాదని ఎన్నికల కమిషనర్ కొత్త యాప్ తీసుకొస్తానని ప్రకటించడంపై అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా ఇవేమీ లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ యాప్‌ను తీసుకొచ్చారు. యాప్ తీసుకురావడంతో ఇంత పట్టుదలగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. దాని ఆవిష్కరించిన తర్వాత పని తీరును మాత్రం కార్యదర్శిచేత చెప్పించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. నిబంధనలకు విరుద్దంగా యాప్‌ను తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. కోర్టులో వ్యవహారం తనకు వ్యతిరేకంగానే ఉంటుందని భావించిన నిమ్మగడ్డ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
ఫిర్యాదులు స్వీకరణకు ప్రైవేటు వ్యక్తులా..?
ఈ వాచ్‌కు వచ్చే ఫిర్యాదులను ప్రైవేటు ఉద్యోగులు స్వీకరిస్తారని ఎస్‌ఈసీ చెబుతోంది. యాప్ ఏర్పాటు వెనుక నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లక్ష్యం ఏమిటో ఈ నిర్ణయంతో అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్నా.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవాలని నిర్ణయించడం వెనుక లక్ష్యం ఏమిటి..? అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేకపోతే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. వారి సేవలను ఉపయోగించుకునేందుకు ఇటీవల నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. కేంద్ర హోం శాఖ అనుమతి కూడా కోరారు. అలాంటిది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కాదని ప్రైవేటు వ్యక్తులను ఫిర్యాదుల స్వీకరణ సేవలకు నియమించుకోవాలనుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.