iDreamPost
android-app
ios-app

రాయలసీమ ఇకపై జలసీమ.. ఏపీఆర్‌డీఎంపీసీడీఎల్‌ ఏర్పాటు

రాయలసీమ ఇకపై జలసీమ.. ఏపీఆర్‌డీఎంపీసీడీఎల్‌ ఏర్పాటు

ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రాయలసీమలోని కరువు ప్రాంతాల ప్రజలకు జగన్‌ సర్కార్‌ తీయ్యని కబురు చెప్పింది. నీరు లేక బీడు వారిని పోలాల్లో జలకళలాడేలా చేసేందుకు వైసీపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమలోని కరువు ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం ఏపీ రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ డెవలెప్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీఆర్‌డీఎంపీసీడీఎల్‌) ఏర్పాటైంది.

ఇకపై రాయలసీమలో నూతనంగా చేపట్టబోయే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు అన్నీ ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి వస్తాయి. ప్రాథమికంగా 40 వేల కోట్ల రూపాయలతో రాయలసీమలో ఇరిగేషన్‌ సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను వివిధ మార్గాల్లో సేకరిస్తారు. నిధులు సేకరణ అంతా కూడా కార్పొరేషన్‌ ద్వారా తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణంపై ఖర్చు చేయనున్నారు. ఈ కార్పొరేషన్‌ ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల రాయలసీమ కరువు రహిత ప్రాంతంగా మారుతుందని స్థానిక నేతలు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.