Idream media
Idream media
రాబోయే కొద్దినెలల్లో గుజరాత్ అసెంబ్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు గుజరాత్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌పై దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గుజరాత్ యువనేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఇటీవలి కాలంలో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన త్వరలో పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆప్ హార్దిక్ కు ఆహ్వానం పలికింది.
ఈ క్రమంలో గుజరాత్ ఆమ్‌ఆద్మీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా హార్దిక్ పటేల్‌ను ఆమ్‌ఆద్మీలోకి రావాలని సూచించారు. గోపాల్ ఇటాలియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ లాంటి పార్టీలో మీలాంటి వారు ఉండకూడదని, హార్దిక్ కాంగ్రెస్‌ను ఇష్టపడకపోతే ఆయన మా పార్టీలో చేరాలని సూచించారు. స్థానిక కాంగ్రెస్ నేతల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, సమయం వృథా చేయడం కంటే మా పార్టీకి సేవలందించడం ఉత్తమం అని, కాంగ్రెస్ లాంటి పార్టీలో మీలాంటి అంకితభావం ఉన్న వ్యక్తులకు స్థానం ఉండదని గోపాల్ ఇటాలియా అన్నారు.
మరోవైపు హార్దిక్ పటేల్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని స్పష్టం చేశారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని, స్థానిక నేతల మధ్య విబేధాలున్నా వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్తామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ అన్నారు. నా పార్టీ మార్పుపై వస్తున్నవన్నీ ఊహాగానాలే అని హార్దిక్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధికి 100శాతం పనిచేశానని, ఇకపైకూడా అలాగే పనిచేస్తానని, గుజరాత్‌లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తామని,గుజరాత్‌ను ఉత్తమంగా మార్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని హార్దిక్ స్పష్టం చేశారు.
పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతో గుజరాత్‌లో 2015లో ఉద్యమం మొదలైంది.ఈ ఉద్యమంలో యువకుడైన హార్దిక్ పటేల్ కీలకపాత్ర పోషించారు.ఉద్యమాన్ని ఉదృతంగా నడపడంతో హార్దిక్ పటేల్‌దే కీలకపాత్ర. 25 ఏళ్ల వయస్సులో హార్దిక్ పటేల్ నడిపిన ఉద్యమంతో గుజరాత్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ ఉద్యమంతో హార్దిక్ పటేల్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. పటేల్‌ను అరెస్ట్ చేయడం, ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం ద్వారా ఆందోళనలను గుజరాత్ సర్కార్ అణిచివేసింది. ఆ తర్వాత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.
182 అసెంబ్లీ స్థానాలు గల గుజరాత్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 సీట్లు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. 1998 నుంచి ఇప్పటివరకు గుజరాత్‌లో బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగు పర్యాయాలు కమలం పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా అధికారం సంపాదించాలని కాంగ్రెస్, సత్తా చాటాలని ఆప్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి.