కరోనా అక్కడికి కూడా చేరింది

లాక్‌డౌన్‌ సడలింపులతో రోజు వారీ పనులు పునఃప్రారంభం కావడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి కూడా పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లోని ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా బ్లాకులను సానిటైజ్‌ చేయిస్తున్నారు.

3, 4 బ్లాకుల్లోని ఉద్యోగులకు కరోనా సోకడంతో ఆయా బ్లాకులను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా బ్లాకుల్లో పని చేసే ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరుకావద్దని తెలిపారు. సదరు ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగి సహచరులు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు కొత్త కేసులు నమోదవుతుండగా.. మరో వైపు బాధితులు వేగంగా కోలుకుని ఇళ్లకు వెళుతున్నారు. తాజాగా 24 గంటల్లో 110 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసులు సంఖ్య 3,042 చేరుకుంది. అయితే ఇందులో కేవలం 845 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 418 మందికి వైరస సోకగా అందులో 197 మంది కోలుకున్నారు. మిగత వారు చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మంది వైరస్‌ బారిన పడగా.. వారందరూ చికిత్స పొందుతున్నారు.

Show comments