iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం..!

నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం..!

గొడవ పెట్టుకోనిదే రోజు గడవదనే నానుడి మాదిరిగా ఉంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహార శైలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచీ వివాదాలే లక్ష్యంగా సాగుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుండడంతో ఆయనకు ఏమాత్రం పాలుపోకుండా ఉన్నట్లుగా ఉంది. అందుకే నిత్యం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులే లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన నిర్ణయాలను కోర్టులు కొట్టివేసిన సమయంలో తేలిపోయింది. అయినా కూడా నిమ్మగడ్డ మరింత వివాదాస్పదంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేదే ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మంత్రి కొడాలి నాని వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాలు ఆయన వ్యవహార శైలి ఎలా ఉందో తెలుపుతోంది. ఎన్నికల కమిషన్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ షోకాజ్‌ నోటీ సులు జారీ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలని కోరగా.. మంత్రి ఆ మేరకు తన వివరణను ఇచ్చారు. ఎన్నికల కమిషన్‌ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, షోకాజ్‌ నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరారు.

అయితే కొడాలి నాని వివరణతో సంతృప్తి చెందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలు ముగిసే వరకూ మంత్రిని మీడియాతో మాట్లాడనీయోద్దని కృష్ణా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ల విషయంలోనూ ఇదే తరహాలో నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు ఏపీ హైకోర్టులో నిలబడలేదు. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కూడా కోర్టులో నిలబడదని అర్థమైంది. అయితే కొడాలి నానిపై ఆంక్షలు వి«ధించిన నిమ్మగడ్డ.. అంతటితో ఆగలేదు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ తాజాగా కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, మంత్రిపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనతోపాటు ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 ప్రకారం కేసు పెట్టాలని ఆదేశించారు. కేసు నమోదు చేయాలని ఆదేశించడంతోపాటు.. ఏ ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సిఫార్సు చేయడం విశేషం.