iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా నెలల తరబడి మూసి ఉన్న పాఠశాలలు ఎట్టకేలకు నేడు తెరుచుకున్నాయి. పాఠశాలలు, కాలేజీల్లోని 9, 10, 12 తరగతుల విద్యార్థులు నిబంధనలు అనుసరించి పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వం కూడా తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేసి, ఒక్కో తరగతి గదిలో 16 మందికి మాత్రమే అనుమతిస్తూ రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సుద్దిర్గ కాలం తరువాత విద్యార్ధులు పాఠశాలలకి రావడానికి ఉత్సాహం చూపారని, మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమం కింద ఇప్పటికే అనేక పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేశామని , అలాగే విద్యార్థులకు జగనన్న విద్య కానుక కిట్టుని కూడా అందచేసినట్టు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే మరో పక్క దాదాపు 6 నెలల నుండి స్కూళ్ళు నడవలేదని ఈ పరిస్తితుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు పూర్తి ఫీజు వసూల్ చేయడం సరైన పద్దతి కాదని , టీచర్లకు , సిబ్బందికి జీతాలు ఉంటాయి కాబట్టి 70% మాత్రమే వసూల్ చేయాలని ఆదేశించామని ప్రభుత్వం విధించిన నిబంధనలు ఎవరు అతిక్రమించినా తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.