Idream media
Idream media
గత ఏడాది మార్చిలో ముమ్మరంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అర్థంతరంగా వాయిదా వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య విభేదాలు, భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అవి తాజాగా పంచాయతీ ఎన్నికలు ప్రారంభానికి ముందు, ప్రారంభమైన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతల నిర్వహణలో భాగంగా నిమ్మగడ్డ వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన రాజకీయపరమైన విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు వైసీపీకి, టీడీపీకి మధ్య కాకుండా.. వైసీపీకి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య జరుగుతున్నాయనేలా ఆయన వ్యవహారశైలి ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించిన నిమ్మగడ్డపై రాజకీయ ముద్ర పడిదింది. తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని నిమ్మగడ్డ చెప్పినా.. అది ఆచరణలో కనిపించకపోవడంతో టీడీపీ ముద్ర పడిపోయింది.
ఇది ఎంతలా అంటే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్వగ్రామంలో ఫలితాలు ఎలా ఉన్నాయనే ఆసక్తిని మీడియాతోపాటు, రాష్ట్ర ప్రజల్లో కలిగేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన స్వగ్రామం గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలకు వెళ్లడం మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీంతో అక్కడ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిని కనబర్చారు. తొలి దశలోనే నిమ్మగడ్డ సొంత ఊరులో ఎన్నికలు జరిగాయి. నిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ గ్రామంలో వైసీపీ బలపర్చిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. వైసీపీ మద్ధతుతో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిమ్మగడ్డ సొంత ఇళ్లు ఉన్న వార్డులోనూ వైసీపీ బలపర్చిన అభ్యర్థే గెలవడంపై ప్రధానంగా చర్చించుకుంటున్నారు. నిమ్మగడ్డ నివాసం ఉన్న ఇంటి వార్డులో 490 ఓట్లు పోలవగా.. వైసీపీ అభ్యర్థికి 256, టీడీపీ బలపర్చిన అభ్యర్థికి 145 ఓట్లు వచ్చాయి. వైసీపీ బలపర్చిన అభ్యర్థి 111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఈ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఐదేళ్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉంటున్న నిమ్మగడ్డకు ఇక్కడ ఓటరుగా నమోదు కాకపోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు.. ఓటరుగా నమోదు చేయించుకోవాడానికి నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సొంత ఊరిలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేద్దామని భావించినా.. ఆయన ఆశ నెరవేరలేదు. నిమ్మగడ్డకు ఓటు లేకపోవడంతో వేయలేకపోగా.. ఓటు ఉన్నా వినియోగించుకునే అవకాశం 3.60 లక్షల మంది కోల్పోయారు. హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితంగా 3.60 లక్షల యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారు.