Idream media
Idream media
తుక్కు కింద కొన్న బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా మార్చి విక్రయించారన్న అభియోగాలతో తమపై వివిధ ప్రాంతాలలోని స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే ఎఫ్‌ఐఆర్ కింద పరిగణించాలని కోరుతూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేరంలో పిటిషనర్ కోరినట్లు ఒకే ఎఫ్‌ఐఆర్ సాధ్యం కాదని రాష్ట్ర హోం శాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, వాహనాల ఛాసిస్ నంబర్లు మార్చడం వంటి అనేక అక్రమాలకు నిందితులు పాల్పడ్డారని హోం శాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది. తుక్కు కింద కొన్న బీఎస్–3 వాహనాలను బీఎస్–4 మార్చి విక్రయించడంలో ఒక్కొ వాహనంలో ఒక్కొ విధంగా నిందితులు వ్యవహరించారని హోం శాఖ హైకోర్టుకు తెలిపింది. నేర ఘటనలు వేర్వేరుగా జరిగినప్పుడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చన్న సుప్రిం కోర్టు తీర్పును హోం శాఖ తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. నేర ఘటనలు దృష్ట్యా పిటిషనర్ వ్యాజం కొట్టివేయాలని హోం శాఖ కోరింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు జేసీ తరఫు న్యాయవాదికి హైకోర్టు గడువు ఇచ్చింది.
బీఎస్–3 వాహనాలను ఈశాన్య రాష్ట్రాలలో తుక్కు కింద కొనుగోలు చేసి వాటిని బీఎస్–4 వాహనాలుగా మార్చి విక్రయించిన కేసులో గత నెల 14వ తేదీన అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వారిని అనంతపురం తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. గడువు ముగియడంతో పలుమార్లు రిమాండ్ పోడిగించారు. అనంతపురం కోర్టు, హైకోర్టులోనూ తండ్రీకొడుకులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ల వల్ల ఊరట దక్కలేదు. దీంతో అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలు కడప సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉంటున్నారు.