పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు

మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో బెదిరింపులు కారణంగా పలువరు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, నోటిఫికేషన్‌ ఇచ్చి పది నెలలు దాటిపోయిన నేపథ్యంలో అది చెల్లదని పేర్కొంటూ జనసేన పార్టీకి చెందిన న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.

పిటిషనర్ల వాదనతో ఏకీభవించని ఎన్నికల కమిషన్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగితే.. మళ్లీ నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించామని కోర్టుకు తెలిపింది. నోటిఫికేషన్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదని, ఒక సారి నోటిఫికేషన్‌ విడుదలయ్యాక దాన్ని ఆపేందుకు అవకాశం లేదని పేర్కొంది. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. మున్సిపల్‌ ఎన్నికలను పాత నోటిఫికేషన్‌ ప్రకారమే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు ఆగిన చోట నుంచి మళ్లీ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. గత ఏడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల దాఖలు వరకు జరిగింది. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 2, 3వ తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్‌ గడువు ఇచ్చింది. 3వ తేదీ సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. 10వ తేదీన పోలింగ్, 13వ తేదీన అవసరమైన చోట రీపోలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది. 14వ తేదీన లెక్కింపు చేపట్టనున్నారు. పార్టీ గుర్తులపై మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి.

Show comments