iDreamPost
android-app
ios-app

ఏలూరు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏలూరు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజనల్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఎన్నికలు నిర్వహించొచ్చని తీర్పు వెలువరించింది. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

ఓటర్ల జాబితా అవకతవకలుగా ఉందని, అది సరి చేసే వరకూ కార్పొరేషన్‌ ఎన్నికలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఓటర్ల జాబితా సరి చేసే వరకూ ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు పోటీదారులు హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌లో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన డివిజనల్‌ బెంచ్‌ కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని, ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది.

హైకోర్టు తీర్పుతో ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఎన్నికలు వాయిదా పడడంతో ఇప్పటి వరకు చేసిన ప్రచారం, అందు కోసం చేసిన వ్యయం బూడిదలో పోసిన పన్నీరైందన పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్నికలు అంటే.. మొదటి నుంచి అడుగులు పడాలి. ఫలితంగా మళ్లీ ఖర్చు తప్పదు. అయితే తాజాగా హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుతో వారందరూ ఊపిరిపీల్చుకున్నారు. రేపు ఉదయం ఎన్నికలు జరిగే అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు ఏలూరు కార్పొరేషన్‌లోనూ పోలింగ్‌ జరగబోతోంది.

ఎన్నికలు జరిగే అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఫలితాలు ఈ నెల 14వ తేదీ వెలువడుతాయి. ఏలూరు ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెల్లడించాలనేది ఈ నెల 23వ తేదీన విచారణలో హైకోర్టు నిర్ణయించే అవకాశం ఉంది. అప్పటి వరకు గెలుపోటములపై అభ్యర్థుల్లో ఉత్కంఠ తప్పదు.

Read Also : ఏలూరు ఎన్నికలకు బ్రేక్!