Idream media
Idream media
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసి గత శనివారం తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ఆగిన చోట నుంచే ఎన్నికలు జరగడం ఖాయమైన నేపథ్యంలో.. పరిషత్ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
గత ఏడాది మార్చిలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల తుది జాబితా వరకు ప్రక్రియ కొనసాగింది. ఏకగ్రీవమైన అభ్యర్థులకు ఇటీవల కోర్టు ఆదేశాలతో డిక్లరేషన్ పత్రాలు అందించారు. ఏకగ్రీవాలపై విచారణ జరపాలంటూ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో పరిషత్ ఎన్నికలపై ఉన్న అన్ని వివాదాలకు ఫుల్‌స్టాఫ్ పడింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గత నెల వరకు ఎంతగానో ఆసక్తి చూపిన నిమ్మగడ్డ.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మునుపటి ఆసక్తి చూపడం లేదు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఫలితాలు రాక ముందునే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం రోజులు అవుతున్నా.. పరిషత్ ఎన్నికలపై ఆలోచన చేయడం లేదు. అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు.
పార్టీ రహిత గుర్తులపై జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ అద్భుత ఫలితాలు సాధించంతోనే.. నిమ్మగడ్డ గ్రామాల్లో పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికలపై సీతకన్ను వేశారనే విమర్శలున్నాయి. ఆయన మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి బలం చేకూరేలా నిమ్మగడ్డ ఎప్పటికప్పడు ప్రవర్తిస్తూనే ఉన్నారు.
గత మార్చిలో పరిషత్ ఎన్నికలు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తర్వాత వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ల పరిశీలన వద్ద ఆగిపోయాయి. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాలేదు. అయితే తిరిగి స్థానిక సంగ్రామం ప్రారంభమైనప్పుడే.. వాయిదా పడిన పరిషత్ ఎన్నికలను నిర్వహించకుండా.. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ముందు నిర్వహించాల్సిన పరిషత్ ఎన్నికలను.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిర్వహించేందుకు నిమ్మగడ్డ దృష్టి పెట్టకపోవడంపై ఆయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారు.
పరిషత్ ఎన్నికలు తిరిగి ప్రారంభమైతే.. ఆరు రోజుల్లోనే ప్రక్రియ ముగుస్తుంది. ప్రచారం తర్వాత పోలింగ్, కౌటింగ్ ప్రక్రియలు పెడింగ్ ఉన్నాయి. పరిషత్ ఎన్నికలు కూడా ముగిస్తే.. పరిపాలనకు ఎలాంటి ఆటంకాలు ఉండవని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగీరం చేయవచ్చనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ నిమ్మగడ్డ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. తీర్పును ఏ విధంగా ఇస్తుందనేది ఆసక్తికర అంశం. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే.. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. అప్పటికి నిమ్మగడ్డ పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఈ నెలలోపు ఎన్నికలు జరగకపోతే.. నూతన కమిషనర్‌ను నియమించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే పరిషత్ ఎన్నికలు మరింత జాప్యం అయ్యే అవకాశముంది.
Also Read : జగన్ బాటలో బీజేపీ