తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు నుంచి అనుమతి లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని హైకోర్టు తెలిపింది. ఈ నెల 17న తిరుపతిలో సభకు అనుమతిని కోరుతూ అమరావతి జేఏసీ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు పాదయాత్రకు 157 మందికి పర్మిషన్ ఇస్తే.. అంతకు మించి పాల్గొనడంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుపతి పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. దీంతో కోర్టులో పిటిషన్ వేయగా విచారణ చేసిన హైకోర్టు ఈ సభకు అనుమతి ఇచ్చింది.
అయితే విధిగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని చెబుతూ అమరావతి రాజధాని సాధక జేఏసీ ఈ ఏడాది నవంబర్ 1న న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరుతో పాదయాత్రను మొదలు పెట్టింది. అది నిన్నటి తో ముగిసింది. ఇవాళ, రేపు రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుపతిలో మూడు రాజధానులు ముద్దు, మీతో మాకు గొడవలు వద్దు, మీకు మా స్వాగతం అంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీలను అమరావతి జేఏసీ ప్రతినిధులు చించేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అని నినాదాలు చేశారు. మూడు రాజధానులు కావాలనుకునే వారు ధైర్యంగా బయటకు రావాలని అమరావతి జేఏసీ రెచ్చగొట్టేలా కూడా నినాదాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో సభ జరిగితే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని భావించి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని కోర్టులో పిటిషన్లు వేయగా.. షరతులతో అనుమతి లభించింది.
అమరావతి రైతుల సభతోపాటు.. రాయలసీమ పరిరక్షణ సమితి నిర్వహించ తలపెట్టిన సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17వ తేదీన అమరావతి రైతుల సభ, ఆ మరుసటి రోజు రాయలసీమ పరిరక్షణ సమితి సభకు అనుమతి మంజూరు చేసింది. రెండు సభలు వరుస రోజుల్లో జరగనుండడంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : సినిమా టిక్కెట్లపై డివిజనల్ బెంచ్‌కు ఏపీ సర్కార్.. విచారణ రేపటికి వాయిదా..