Idream media
Idream media
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఆ మహమ్మారి మానవ జాతిని వదలిపెట్టి వెళ్లడం లేదు. రూపాలు మార్చుకుంటూ మానవాళికి పెను సవాళ్లను విసురుతూనే ఉంది. ప్రస్తుత ఒమిక్రాన్ అనే కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్ సహా పదుల దేశాలలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోనూ ఒక కేసు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదం వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం కాకుండా.. అసలు ప్రమాదమే రాకుండా చేసేందుకు సీఎం వైఎస్ జగన్ పక్కా ప్లాన్‌తో వెళుతున్నారు. ఈ రోజు వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. థర్డ్ వేవ్ రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మొదటి వేవ్, సెకండ్ వేవ్ లలో మరణాలు సంభవించాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వజ్రాయుధంగా పని చేస్తుందన్న నిఫుణుల సూచనల నేపథ్యంలో.. సీఎం జగన్ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. జనవరి లోపు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ రెండో డోస్ వేయడం పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు..
ఇప్పటి వరకు ఉన్న ల్యాబ్‌ల ద్వారా ప్రస్తుత ఒమిక్రాన్ వైరస్ నిర్థారణ చేయడం సాధ్యం కావడం లేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ విధానంలో మాత్రమే ఒమిక్రాన్ వైరస్ నిర్థారణను గుర్తిస్తున్నారు. ఈ తరహా ల్యాబ్‌లు రాష్ట్రంలో లేకపోవడంతో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించడంలో ఆలస్యమవుతోంది. ఆలస్యం వల్ల.. వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేదుకు… రాష్ట్రంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలోనూ రాష్ట్రంలో తిరుపతిలో తప్పా.. మరోచోట వైరస్ నిర్థారణ ల్యాబ్ అందుబాటులో లేదు. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన.. జిల్లాకి ఒకటి చొప్పన ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
Also Read : సంక్షేమంలో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్.. ఇదిగో నివేదిక
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు..
కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ సోకిన వారికి శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. కృత్రిమ ఆక్సిజన్ అందించడం అత్యవసరమైంది. తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో.. బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడింది. తయారు చేసేందుకు అవసరమైన ప్లాంట్లు లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. సెకండ్ వేవ్.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో లోపాలను బయటపెట్టింది. మళ్లీ థర్డ్ వేవ్ వస్తే.. ఆక్సిజన్ కొరత సమస్య రాకుండా ఉండేలా.. ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లను జగన్ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో 144 ఆక్సిజన్ ప్లాంట్లు ఈ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి, దాని ప్రభావం పెద్దగా ఉండబోదని అంచనాలున్నా.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది.