iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సాగిన భూపందేరాల వ్యవహారాలు ఇప్పటికే బయటపడ్డాయి. ఇక తాజాగా అదే పరంపరలో పార్టీ పేరుతో సాగిన పంపిణీ కూడా కూపీ లాగేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చొరవతో టీడీపీ మూలస్థానమే బయటపడుతుందనే ప్రచారం మొదలయ్యింది. తాజాగా టీడీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం ఏపీ టీడీపీ కార్యాలయంగా భావిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పునాదులకే ఎసరు వస్తున్నట్టు కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాల కోసమంటూ చంద్రబాబు పాలనలో పలు జిల్లాల్లో ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. ఎన్టీఆర్ భవన్ పేరుతో 33 ఏళ్లు, 99 ఏళ్లు కింద లీజుకి కట్టబెట్టారు. వాటిలో ప్రభుత్వ పోరంబోకు భూములు, జెడ్పీ స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలున్నాయి. విలువైన స్థలాలను కారుచౌకగా ఎన్టీఆర్ భవన్ సేవా కార్యకలాపాల కోసమంటూ రికార్డుల్లో చూపించి, టీడీపీ కార్యకలాపాలకు కేంద్ర స్థానాలుగా మార్చుకున్న తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి భూములు లేవని చెప్పిన ప్రభుత్వం ఇలా పార్టీ కోసం ఖరీదైన భూములు కట్టబెట్టడాన్ని అప్పట్లోనే ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయపోరాటానికి సైతం దిగారు.
ఇక ఇప్పుడు మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో ప్రభుత్వ పోరంబోకు భూము 3ఎకరాల స్థలంలో కట్టిన టీడీపీ కేంద్ర కార్యాలయం నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడంతో దానిపై గురిపెట్టినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే చర్యలకు పూనుకుంటున్నట్టు చెబుతున్నారు. దాంతో పాటుగా గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి కూడా సెగ తప్పదని సమాచారం. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే 20 ఏళ్ల క్రితం గుంటూరు కార్యాలయానికి భూమి కేటాయించారు. నగరం నడిబొడ్డులో ఏటా 24 వేల రూపాయల పన్ను చెల్లిస్తూ పార్టీ వ్యవహారాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కార్యాలయాల మీద ఆర్కే పట్టుదలతో సాగుతున్న సమయంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే చర్చ మొదలయ్యింది.
తెలుగుదేశం పార్టీ సొంత భవనాల కోసం ప్రభుత్వ భూములు కాజేసిన తీరు మీద ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తే వాటితో పాటుగా మరిన్ని కార్యాలయాలు కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకుంటుందో చూడాలి. వాటి ప్రభావం టీడీపీ పునాదులపై ఎంత మేరకు ఉంటుందన్నది ఆసక్తికరమే.