AP news టెన్త్‌ ఫెయిల్‌ అయ్యారా?

ఇటీవల విడుదలైన ఏపీ టెన్త్ ఫలితాల్లో రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అవ్వడం.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఫలితాలపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులను గ్రేస్ మార్కులిచ్చి పాస్ చేయాలంటూ.. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. ఎవరినీ నొప్పించకుండా ప్రభుత్వం నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనా.. రెగ్యులర్ పాస్ గానే పరిగణించి గ్రేడ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రివిజన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆయా పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యేంతవరకూ.. రోజుకి రెండు సబ్జెక్టుల చొప్పున అన్ని సబ్జెక్టులకూ రివిజన్ క్లాసులు జరగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ క్లాసులను నిర్వహిస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులంతా రివిజన్ క్లాసులకు హాజరయ్యేలా డీఈఓలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈమేరకు రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలకు పాఠశాలవిద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ మార్గదర్శకాలు జారీచేశారు. విద్యార్థుల కోసం కోచింగ్ క్లాసుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు ఈమేర‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను త‌యారుచేసుకోవాల‌ని, రెమిడియల్‌ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా అవ‌స‌ర‌మైన మేర‌కు టైమ్‌టేబుళ్లను రూపొందించుకోవాలని, ఏ టీచర్‌ ఏ సమయంలో స్కూల్‌లో ఆయా సబ్జెక్టులపై టీచ్ చేయాలో కూడా జాబితా రూపొందించాలన్నారు. వీటిని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు పంపించాల‌ని కోరారు.

పాఠశాలవిద్య కమిషనర్‌ మార్గదర్శకాలు అందిన వెంటనే అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఇప్ప‌టికే డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తీర్ణ‌తశాతాన్ని పెంచ‌డకోసం అన్నిర‌కాల ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేస్తున్నారు.

ఏపీలో మొత్తం 6,15,908మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,01,627మంది ఫెయిలయ్యారు.

 

 

Show comments