iDreamPost
android-app
ios-app

AP: సినిమా టికెట్ల కలెక్షన్లు – భ్రమలు నిజాలు

  • Published Jun 17, 2022 | 3:09 PM Updated Updated Jun 17, 2022 | 3:09 PM
AP: సినిమా టికెట్ల కలెక్షన్లు – భ్రమలు నిజాలు

అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లకు ఆన్ లైన్ సిస్టమ్ తీసుకురానుంది. దీనికి సంబంధించి కొన్ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పద్ధతిలో గవర్నమెంటుకు వసూలయ్యే కలెక్టన్ మొత్తం థియేటర్ యజమానులకు వెంటనే రాదని చాలా సమయం తీసుకోవడం ద్వారా ఎగ్జిబిటర్ల మీద వడ్డీల భారం పడుతుందని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవంగా ఏపి సర్కారుకి అలాంటి ఆలోచనే లేదని అధికార వర్గాల సమాచారం. ఏ రోజుకా రోజు థియేటర్ల బ్యాంక్ అకౌంట్లలో ట్యాక్స్ మినహాయించుకుని సొమ్ము పడిపోతుందని, ఇది నిరాటంకంగా కొనసాగేలా తగిన చర్యలు చేపడుతున్నామని అంటున్నారు.

ఏపిఎస్ఎఫ్ టీవీటిడిసి థియేటర్ ఓనర్లతో ఒప్పందాలకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే జిఓ ద్వారా టెండర్లు పూర్తయ్యాయి. ఒప్పంద పత్రంలోని ఆరో నిబంధనలో చాలా స్పష్టంగా టికెట్ కలెక్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో పేర్కొంది. సర్వీస్ ఛార్జ్ 1.95 శాతం పోను మిగిలిన వసూళ్లు నేరుగా ఎగ్జిబిటర్ ఖాతాకు వచ్చేస్తాయి అది కూడా ఇరవై నాలుగు గంటల గరిష్ట వ్యవధిలో. ఈ వెబ్ సైట్ కు సంబంధించిన సాంకేతికతను టికెట్ కౌంటర్ తో పాటు మేనేజర్ ఛాంబర్ లోనూ సెట్ చేస్తారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా జరిగిన అమ్మకాలు షో పూర్తవ్వగానే జమవుతాయి. బిఫార్మ్ లైసెన్స్ కు సంబంధించిన ప్రాసెస్ ని కూడా సరళీకృతం చేయనున్నారు

ప్రభుత్వం పెట్టిన గడువులోపే థియేటర్ యజమానులు అగ్రిమెంట్ ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. జూలై మొదటి వారం నుంచి ఆన్ లైన్ విధానం అమలు చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే తీసుకోబోయే చర్యల మీద కూడా ప్రణాళిక సిద్ధంగా ఉంది. టికెట్లు మొత్తం బ్లాక్ చేసి నల్లబజారులో అమ్ముకోవడాన్ని కట్టడి చేయడంతో పాటు కలెక్షన్లను ఎక్కువగా చూపించుకుని జనాన్ని మోసం చేసే వైనాన్ని దీని ద్వారా అడ్డుకోవచ్చు. ఇకపై పోస్టర్లలో మాకు రెండు వందల కోట్లు వచ్చాయి ఆరు వందల కోట్లు వచ్చాయని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పే అవకాశం ఉండదు. అఫీషియల్ గా ప్రభుత్వమే సరైన ఫిగర్లను బయటికి చెప్పబోతోంది