Idream media
Idream media
ఈ రోజు బుధవారం జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పండింది. ముందుగానే నిర్ణయించిన ఈ సమావేశం వాయిదా పడడం, తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆసక్తిగా మారింది. మంత్రివర్గ భేటీ వాయిదా పడడానికి గల కారణాలను రాజకీయ నేతలు, మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా ఎవరికి వారు తమకు తోచినట్లు ఊహించుకుంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ చేపట్టాలని ఓ వైపు అధికార పార్టీ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని పత్రిపక్ష పార్టీ మరో వైపు, మధ్యలో నిన్న సీనియర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి ఘటన, హైపవర్ కమిటీ తొలి భేటి.. ఇలా అనేక ముఖ్యమైన పరిణామాల నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడడం చర్చనీయాంశమైంది.
ఈ నెల 18వ తేదీన తిరిగి మంత్రివర్గ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 20వ తేదీన సచివాలయం విశాఖ నుంచి పని చేస్తుందని రెండు రోజుల క్రితం మీడియాలో కథనాలు వచ్చాయి. శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయని ఉటంకించారు. భవనాలు కూడా సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో సచివాలయం తరలింపుపై చర్చ జరుగుతుందని సచివాలయ ఉద్యోగులతోపాటు అందరూ ఊహించారు. ఈ అంశంపై ఎదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. ఈ నేపధ్యంలో సచివాలయం తరలింపునకు ఇంకా 12 రోజుల సమయం ఉండడంతో ఇప్పుడే ఈ విషయంపై మంత్రివర్గంలో చర్చించడం ఉద్రిక్తలను మరింత పెంచుతుందన్న భావనలో వాయిదా వేసుంటారని అధికార పార్టీ సానుభూతి పరులు అంచనా వేస్తున్నారు.
మరో వైపు నిన్న ప్రభుత్వ చీఫ్ విప్‌పై దాడి జరగడంతోనే మంత్రివర్గ సమావేశం వాయదా వేశారని కూడా అంటున్నారు. అమరావతి గ్రామాల ప్రజలపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకుందని, వారికి అన్యాయం జరగదని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. వారు చేసే ఉద్యమాలకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. అయినా నిన్న కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ చీఫ్ విప్‌పై దాడి జరగడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు.
చంద్రబాబు ట్రాప్‌లో పడిన రైతులు పోలీసుల అనుమతి లేకపోయినా జాతీయ రహదారి దిగ్భందానికి వెళ్లారు. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ కార్యకర్తలు పిన్నెల్లిపై దాడి చేశారు. రైతుల శాంతియుతంగా తమ గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నది ప్రభుత్వవర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. కారణాలేమైనా మంత్రివర్గ సమావేశం వాయిదా పడడం అనేక అనుమానాలకు, చర్చలకు తావిచ్చింది.