iDreamPost
iDreamPost
విద్వేషాలు రగిల్చడమే పనిగా కథనాలు అల్లుతున్న ఆంద్రజ్యోతి రాధాకృష్ణకు మరో షాక్ తగిలింది. ఆయన పత్రికలో రాసిన వార్తలకు వరుసగా వస్తున్న లీగల్ నోటీసుల పరంపరలో మరోటి చేరింది. తాజాగా ఆ పత్రికలో వచ్చిన రెడ్డీస్ తో డేంజరే అనే కథనానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లీగల్ నోటీసు జారీ చేశారు. దాంతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అడ్డగోలు రాతలతో పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న రాధాకృష్ణ కు మరో కేసు తోడయ్యిందనే చెప్పవచ్చు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరుతో ఈ కథనం ప్రచురితమయ్యింది. కానీ వాస్తవానికి ఆమె వ్యాఖ్యలను అనుకరించి, ఆడియో క్లిప్ ప్రసారం చేసినట్టు ఇప్పటికే ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తుళ్ళూరు పీఎస్ లో దానిపై కేసు నమోదయ్యింది. సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసిన వారిని విచారించి, ఆ ఆడియో క్లిప్ వెనుక అసలు కారకులెవరన్నది గుర్తించే పనిలో ఉన్నారు.
అదే సమయంలో ఆ ఆడియో క్లిప్ వాస్తవమా కాదా అన్నది పరిశీలించకుండా ప్రసారం చేసి, ప్రచురించినందుకు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక చిక్కుల్లో పడింది. ఎమ్మెల్యే ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆడియో క్లిప్ సృష్టికర్తలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం, అందులో లేళ్ల అప్పిరెడ్డి పేరు ప్రస్తావించడంతో రాధాకృష్‌ణ ఇరుక్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సామాజికవర్గాల మధ్య విబేధాలు రాజేసి, సమాజంలో విద్వేష వాతావరణం పెంచే ప్రయత్నంలో ఇలాంటి కథనాలు రాసినట్టు నోటీసులో పేర్కొన్నారు. దాంతో సమాజంలో శాంతి విచ్ఛిన్నానికి కుట్ర పన్నినట్టు ఆయన పై అభియోగం నమోదయ్యే అవకాశం ఉంది.
వార్తలు పచురించే ముందు అసలు ఎవరి పేరు ప్రస్తావించినా వారిని సంప్రదించి వివరణ తీసుకోవడం సహజ న్యాయం. కానీ ఆంధ్రజ్యోతికి అవేమీ పట్టవు కాబట్టి, సోషల్ మీడియాలో దొరికిన చిన్న క్లిప్పు ఆధారంగా పతాక శీర్షికల్లో కథలు అల్లే ప్రయత్నం చేస్తోంది. చివరకు ఇలా చట్టం ముందుకు ఇరుకోవాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.