iDreamPost
android-app
ios-app

Andhra jyothi, Pensions – ఆంధ్రజ్యోతి అవస్థలు వర్ణనాతీతం, అటువంటి కష్టం ఎవరికీ రాకూడదేమో!

  • Published Jan 02, 2022 | 3:56 AM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Andhra jyothi, Pensions – ఆంధ్రజ్యోతి అవస్థలు వర్ణనాతీతం, అటువంటి కష్టం ఎవరికీ రాకూడదేమో!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆయన అనుకున్నవేమీ జరగకపోవడంతో కొంతకాలంగా అసహనం హద్దులు మీరుతోంది. అడ్డగోలు రాతల్లో అది ప్రతిధ్వనిస్తోంది. తాజాగా ఏపీలో పెన్షన్ల గురించి మరోసారి అర్థరహితంగా కథనం అచ్చేశారు. వాస్తవాలు తమకు గిట్టవని మరోసారి నిరూపించుకున్నారు.

అర్జెంటుగా చంద్రబాబుని గద్దెనెక్కించాలనే లక్ష్యంలో అడ్డదారులు తొక్కడానికి అలవాటపడ్డారు. ఆక్రమంలోనే అయినదీ కానిదీ అచ్చేసి అందరినీ తమతో పాటు భ్రమల్లో ముంచగలమని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

దేశంలోనే సామాజిక పెన్షన్ల పంపిణీలో ఏపీకి ప్రత్యేకత ఉంది. ఒకటో తేదీ తెల్లవారుజామునుంచే లబ్దిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. వాడవాడలా వాలంటీర్లు పొద్దుపొడవకముందే పెన్షన్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా మారుతోంది. అంతేగాకుండా లబ్దిదారుల ఎంపికలో కూడా వాలంటీర్ల పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎవరు అర్హులన్నది గుర్తించి, నేరుగా వారింటికి వెళ్లి కొత్తగా పెన్షన్లు అందుకునేందుకు అన్ని అర్హతలుంటే వెంటనే పంపిణీ చేసే అవకాశం ఏర్పడింది. దాంతో ఏపీలో పెన్షన్ల పంపిణీ విధానం ఆదర్శనీయంగా మారింది.

పెన్షన్ల విషయంలో కూడా క్రమంగా పెంచుకుంటూ పోతామన్న జగన్ తన హామీని ఆచరణలో చూపుతున్నారు. రెండున్నరేళ్ల పాలనలో రెండు పర్యాయాలు పెన్షన్లు పెంచారు. అనివార్యంగా వచ్చే ఎన్నికల నాటికి 3వేల రూపాయలకు పెన్షన్లు పెంచడానికి అడుగులు వేస్తున్నారు. ఓవైపు పేదలకు అన్నీ ఉచితంగా పంచేస్తున్నారని టీడీపీ అడ్డందిడ్డంగా వాదిస్తుంది. దానికి ఆంధ్రజ్యోతి వత్తాసు పలుకుతుంది. పప్పుబెల్లాల్లా ప్రజలకు పథకాలు ఇచ్చేస్తూ ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారని రోజూ రాస్తూ ఉంటుంది. అదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు జగన్ హయాంలో పెరిగిన పెన్షన్ మొత్తం, పెన్షన్ దారుల సంఖ్య గురించి వాస్తవాలను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ప్రభుత్వ ప్రకటనలో అచ్చేసిన తప్పిదాలు అంటూ రాసిన రాతల్లో ఆక్రోశం తప్ప అసలు వాస్తవాలు భూతద్దం పెట్టి వెదికినా కనిపించవన్నట్టుగా ఉంది.

సరిగ్గా చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందుగా పెన్షన్లు పెంచిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుచేసింది. అదే నేరమన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి అక్కసు వెళ్లగక్కుతోంది. అంతేగాకుండా చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం వెళ్లిన వారికి జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ శ్రేణులు చుక్కలు చూపించిన సంగతి విస్మరించాలని చెబుతోంది. సామాన్యుల అవస్థలు తీరి, అంతా సమర్థవంతంగా పెన్షన్లు అందిస్తుంటే దానిని సహించలేనితత్వాన్ని ఆంధ్రజ్యోతి చాటుకుంటోంది. అందుకే పాపం ఆంధ్రజ్యోతికి వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నట్టుగా పేదలకు వ్యతిరేకంగా వ్యవహరించడం తప్ప పచ్చ మీడియాకు పనీపాటలేనట్టుగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో 61 లక్షల 70 వేల మందికి పెన్షన్లు అందించిన ఘనత ఎన్నడైనా ఉందా అనేది ఆంధ్రజ్యోతి సమాధానం చెప్పగలదా. జ్యోతిలో పేర్కొన్న ప్రకారమే గడిచిన రెండేళ్లలోనే ఏకంగా 8లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని కాదనగలదా.. కాకమ్మ కథలతో జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఎంత విషం జిమ్మితే అంతగా బాబు అండ్ కో బద్నాం కావడమే తప్ప జగన్ ని జనాలకు దూరం చేయలేమన్నది గ్రహిస్తే మంచిది. పులివెందుల పులి, పిల్లి అంటూ రాసుకుని ఆత్మసంతృప్తి పడితే అంతకుమించి అవివేకం మరోటి ఉండదని తెలుసుకుంటే శ్రేయస్కరం.