iDreamPost
android-app
ios-app

లోకేష్ కు అనంత సీనియర్లు షాక్ ఇచ్చారా ?.. ఫోన్లు స్విచ్చాఫ్

  • Published Jun 16, 2020 | 3:07 AM Updated Updated Jun 16, 2020 | 3:07 AM
లోకేష్ కు అనంత సీనియర్లు షాక్ ఇచ్చారా ?.. ఫోన్లు స్విచ్చాఫ్

జేసి ట్రావెల్స్ లో జరిగిన అక్రమాల కారణంగా మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి+కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో జేసి కుటుంబాన్ని పరామర్శించటానికి చినబాబు నారా లోకేష్ తాడిపత్రికి వెళ్ళాడు.

ఎప్పుడైతే తాడిపత్రి టూర్ ఫిక్సయ్యిందో వెంటనే జిల్లాలోని సీనియర్ నేతలందరూ లోకేష్ పర్యటనలో పాల్గొనాలని ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ నుండి ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారం. అయితే లోకేష్ తాడిపత్రికి వెళ్ళాడు, వచ్చాడు కానీ సీనియర్లలో చాలామంది అడ్రస్ ఎక్కడా కనబడలేదట. దాంతో చినబాబు షాక్ కు గురైనట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

జిల్లాకు లోకేష్ ఎందుకు వచ్చినా సీనియర్ నేతల్లో చాలామంది ఎందుకు హాజరుకాలేదన్న విషయంపై ట్రస్టుభవన్ బాధ్యులు మాట్లాడుదామని చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయట. ఎందుకంటే చాలామంది తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకోవటంతో ట్రస్ట్ భవన్ నుండి కాంటాక్ట్ చేయటం సాధ్యంకాలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జేసి బ్రదర్స్ ఇంటికి లోకేష్ రావటాన్ని చాలామంది సీనియర్ నేతలకు మంటగా ఉందట.

అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అక్రమాలు, ధౌర్జన్యాలతో చెలరేగిపోయిన జేసి బ్రదర్స్ కు లోకేష్ మద్దతుగా నిలవటాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారట. పైగా 2014-19 మధ్య జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, నేతలను జేసి బ్రదర్స్ ప్రశాంతంగా ఉండనీయలేదు. ప్రతి నియోజకవర్గంలోను తమ మద్దతుదారులను పోటి నేతలుగా తయారు చేసి స్ధానిక ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా ప్రోత్సహించారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో చాలామంది ఎంఎల్ఏలకు జేసి బ్రదర్స్ కు మధ్య ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు సమక్షంలో పంచాయితీలు జరిగినా ఉపయోగం లేకపోయింది.

అందుకనే మాజీమంత్రి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, ఉన్నవ హనుమంతరాయ చౌదరి, జితేంద్రగౌడ్, కందికుంట ప్రసాద్ లాంటి మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగానే డుమ్మా కొట్టారని పార్టీలో చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉండగా అక్రమాలు చేసి ఇపుడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన జేసి బ్రదర్స్ ను లోకేష్ పరామర్శించటం ఏమిటి అనే విషయంలోనే చాలామంది సీనియర్ నేతలు మండిపోతున్నారు.

ఏదన్నా గెస్ట్ హౌస్ లోనో లేకపోతే పార్టీ కార్యాలయంకు లోకేష్ వచ్చుంటే చాలామంది నేతలు వచ్చేవారనటంలో సందేహం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అసలే చాలామంది నేతలకు జేసి బ్రదర్స్ తో పడదు. పైగా ఇపుడు అరెస్టయ్యింది కూడా చేసిన అక్రమాలకే అన్న విషయం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఈ కారణంగానే లోకేష్ పర్యటనలో చాలామంది సీనియర్లు కనబడలేదని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.మరి సీనియర్ నేతల మనోభావాలను చంద్రబాబు, చినబాబు పరిగణలోకి తీసుకుంటారా ?