ఇరాన్ డైరెక్టర్ మాజిద్ మజిది తీసిన ‘Children of Heaven’, ‘The Songs of Sparrows’ గానీ ‘Miracle in Cell No. 7’ అనే టర్కీ సినిమా గానీ చూశాక చిన్న పిల్లలతో తీసే సినిమాల్లో అంత డ్రామా ఉంటుంది, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది కదా మరి మన వాళ్లు ఎందుకు అలాంటి సినిమాలు తియ్యట్లేదు అనిపించేది. దానికి సమాధానమేనేమో ఈ ‘Pahuna’.
నేపాల్ లోని హిమాలయ పర్వత సానువుల్లో ఒక అందమైన కుగ్రామం మీదుగా కెమెరా సాగుతుండగా ఉన్నట్టుండి కాల్పులు. ఎందుకో ఎవరి కోసమో తెలియదు. ఆ ఆపత్కాలంలో అందిన కాడికి చేతబట్టుకుని ఊరు దాటుతుంటారు కొంతమంది. వెంటాడుతున్న దుండగులను దారి తప్పించడానికి వెళ్తే తన భర్తని వెతుక్కుంటూ నెలలు బిడ్డని పదేళ్లు కూడా నిండని కూతురు అమృత, కొడుకు ప్రణయ్ లకు అప్పగించి నేను మళ్లీ వస్తానని చెప్పి తన పిల్లలను కనిపెట్టుకోనుండమని ఇంకో ఆమెకు చెప్పి వెళ్లిపోతుంది.
విధిలేని పరిస్థితుల్లో పూర్వపరాలన్నీ ఆలోచించి అందరూ సిక్కిం వైపుగా వెళ్లాలని నిర్ణయిస్తారు. సిక్కిం రావడానికి భయపడ్డ ఒక ముసలోడు అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయనీ వాళ్లు మన దేవున్ని, మతాన్ని దూరం చేస్తారనీ, చిన్న పిల్లలు దొరికితే చంపి తినేస్తారని ఏవేవో చెప్తాడు. ఆ మాటలు అమృత, ప్రణయ్ ల్లో చాలా బలంగా నాటుకుంటాయి. చావనైనా చద్దాం కానీ ఆ మిషనరీల దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుని ఆ గుంపు నుంచి దూరంగా వెళ్లి ఊరి బయట ఒక చెడిపోయిన బస్సును శుభ్రం చేసుకుని అందులో తలదాచుకుంటారు.
అక్కన్నుంచి అమృత, ప్రణయ్ లు ఇద్దరూ చిన్ని చిన్ని మాటలు పంచుకుంటూ, నెలల తమ్ముడు విక్రమ్ బాగోగులు వంతుల వారీగా చూసుకుంటూ తమ వెంట తెచ్చుకున్న సరుకులతో జాగ్రత్తగా గడుపుతుంటారు. తమ సరుకులు అయిపోగానే ప్రణయ్ వెళ్లి ఒక ముసలాయన దగ్గర మేకలు కాసే పనిలో చేరి పాలు సంపాదిస్తే, అమృత వెళ్లి ప్రెగ్నెంట్ లేడీ వద్ద ఇంటి పని చెయ్యడానికి వెళ్లి తమ తిండికి సంపాదిస్తుంది. అక్కన్నుంచి వాళ్లెలా సర్వైవ్ అయ్యారు చివరికి తమ తల్లిని కలిశారా లేదా కలిస్తే ఎలా కలిశారు అనేది చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది.
బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక కుందేలును ట్రాప్ లో పడేస్తాడు ప్రణయ్. దాన్ని ఎలా వండాలా అని ఆలోచించి చూసి చూసి చంపలేక “దీన్ని మనం పెంచుకుందాం” అని ప్రణయ్ అంటే “వద్దు దీన్ని వదిలేద్దాం. పాపం వాళ్లమ్మ వెతుకుతుంటుంది కదా” అని అమృత అన్నప్పుడు పసితనం తాలూకు నిష్కల్మషత్వం, బిడ్డని చూసుకోవడంలో ఒకరికొకరు పోటీ పడి నువ్వు మానెయ్యంటే నువ్వు మానెయ్యని చిరు గొడవ పడి ప్రణయ్ అలిగినప్పుడు వాళ్ల అమాయకత్వం, తమ్ముడు విక్రమ్ ని ఫాదర్ ఎత్తుకుపొయ్యాడు తినేస్తాడేమో అని వీళ్లిద్దరూ పడే ఆవేదన మనల్ని ఎక్కడో కదిలిస్తుంది.
మతం గానీ మరోటి గానీ అనాలోచితంగా తర్కానికి ఆవల మనం మాట్లాడే మాటలు చిన్న పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతాయో మనకు మనం ఆలోచించుకునేలా చేస్తుంది.
సినిమా చూస్తున్నంత సేపూ హిమాలయాల తాలూకు అందాలు, పర్వత సానువుల తాలూకు రూరల్ జీవన విధానం మనకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
అమృత, ప్రణయ్ పాత్రధారులుగా చేసిన ఇద్దరూ పిల్లలూ వాళ్లు నవ్వితే మన పెదవుల్లో చిరునవ్వులు, వాళ్లు ఏడ్చినపుడు మన కళ్ళని చెమర్చేలా చేశారంటే ఇంత చిన్న వయసులో అంత బాగా చేసి అద్భుతం అనిపిస్తారు. తప్పక చూడండి పిల్లలతో సహా.
#Pahuna Available in NetFlix.
Also Read : Pushpa Pre Release : బన్నీ అభిమానులు ఎందుకు హర్ట్ అయ్యారు