iDreamPost
iDreamPost
జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి కేసులో.. రోజుకో సంచలన విషయం బయటకొస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. సాదుద్దీన్ మినహా మిగతా ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించిన విషయం తెలిసిందే. వారిని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించాలని పోలీసులు పిటిషన్ వేశారు. తాజాగా బాధిత బాలిక మెడికల్ రిపోర్టును వైద్యులు పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టు చూసిన పోలీసులు ఖంగుతిన్నారు.
లైంగికదాడి సమయంలో బాలికను తీవ్రంగా హింసించినట్లు మెడికల్ రిపోర్టులో పేర్కొన్నారు వైద్యులు. లైంగిక దాడికి సహకరించకపోవడంతో మైనర్ మెడపై.. ఇతర భాగాలపై గోళ్లతో దాడిచేసినట్లు పేర్కొన్నారు. బాలిక శరీరంపై మొత్తం 12 గాయాలున్నట్లు వైద్యులు నిర్థారించారు. లైంగికదాడికి నిరాకరించడంతో.. నిందితులు ఆమెను దారుణంగా హింసించినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయింది.
ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ మాలిక్ ను మూడ్రోజులు కస్టడీకి ఇవ్వగా.. రెండోరోజు పోలీసులు విచారణ చేస్తున్నారు. మైనర్‌ను ట్రాప్ చేసింది ఎవరూ అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్లను అరెస్ట్ చేసిన తొలిరోజే.. జువైనల్ హోంలో ముగ్గురు మైనర్లను అధికారులు విడివిడిగా విచారించారు.