Idream media
Idream media
అమ్మ ఒడి పథకం రెండో విడత అమలు కార్యక్రమం వాయిదా పడేందుకు చేసిన కుట్రలు పటాపంచలు అయ్యాయి. సంక్షేమ పాలనలో విశ్వసనీయతే లక్ష్యంగా రెండో ఏడాది అనుకున్న సమయానికే అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గండికొట్టేందుకు చేసిన ప్రయత్నాలు చెల్లాచెదురయ్యాయి. హడావుడిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంటూ షెడ్యూల్ జారీ చేసి, అప్పటికే అమలు తేదీని నిర్ణయించిన అమ్మ ఒడ పథకం, అమలులో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు చేయగా.. చివరకు చట్టం, ధర్మం గెలిచాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నెల్లూరులో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియను మొదలు పెట్టారు.
తప్పు చేసి.. తప్పక దిద్దుకుని..
అమ్మ ఒడి పథకం రెండో విడత ఎప్పుడు అమలు చేస్తామనేది గత నెలలోనే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. 9వ తేదీనే ఈ పథకం అమలు కావాల్సి ఉండగా.. రెండో శనివారం సెలవు కావడంతో.. ఈ రోజు సోమవారానికి వాయిదా వేశారు. అయితే 9వ తేదీకి ఒక్క రోజు ముందు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఆ పథకం అమలును నిలిపివేయాలని ప్రొసీడింగ్స్ జారీ చేసి విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన రేకెత్తించారు. అనుకున్న సమయానికి పథకం అమలు జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయినా పథకం అనుకున్న సమయంలో అమలు జరుగుతుందా..? లేదా…? అనే సందేహం ప్రజల్లో ఏదో ఓ మూలన ఉంది. అటు ప్రభుత్వం, ఇటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు రావడంతో.. నిమ్మగడ్డ వెనక్కి తగ్గారు. రాజకీయ నాయకులు పాల్గొనకుండా అమ్మ ఒడి పథకం అమలు చేయొచ్చంటూ చెప్పుకొచ్చారు. కోడ్ పల్లెలకే పరిమితం అవుతుందంటూ చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు.
అమ్మల మోముల్లో చిరునవ్వులు..
కుట్రలు పటాపంచలై అమ్మ ఒడి పథకం అనుకున్న సమయంలో అమలు కావడంతో తల్లులు మోముల్లో చిరునవ్వులు వెలుస్తున్నాయి. ఏ పాఠశాలకు పంపినా అమ్మ ఒడి పథకం అమలు చేస్తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. పిల్లలను చక్కగా చూసుకునేందుకు, వారికి మంచి ఆహారం అందించేందుకు తల్లులు అమ్మ ఒడి నగదును ఉపయోగిస్తున్నారు. ప్రతి ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా.. అర్హులకు పథకం రాలేదనే మాట లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది 44,48,865 మంది తల్లులకు అమ్మ ఒడి పథకం వర్తించబోతోంది. ఇందులో ఈ ఏడాది కొత్తగా 1,48,865 మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు.