iDreamPost
android-app
ios-app

Amma Rajeenama : కంటతడి కనువిప్పు రెండూ కలిగించిన సినిమా – Nostalgia

Amma Rajeenama : కంటతడి కనువిప్పు రెండూ కలిగించిన సినిమా – Nostalgia

కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే బడా నిర్మాతలు కేవలం స్టార్లతోనే సినిమాలు తీస్తామని మడికట్టుకు కూర్చుంటే మంచి చిత్రాలు తీసే అవకాశాన్ని పోగొట్టుకున్నట్టేగా. అందుకే సమయోచితంగా అప్పుడప్పుడూ వీటినీ తీస్తూ ఉంటే ఆత్మ సంతృప్తితో పాటు జేబు సంతృప్తి కూడా దొరుకుతుంది. అదెలాగో ఓ ఉదాహరణ చూద్దాం. 1991. అగ్ర నిర్మాతలు అశ్వినిదత్, దేవీవరప్రసాద్, త్రివిక్రమరావులు ఓ సందర్భంలో కలుసుకున్నారు. మరాఠిలో విజయవంతమైన నాటకం ఆయీ రిటైర్ హోతి ప్రస్తావన తెచ్చారు దత్తు గారు. అప్పటికే హక్కులు కొన్నారాయన..ఒక్కళ్ళే నిర్మించే సత్తా ఉన్నా ముగ్గురూ కలిసి తెలుగులో తీసేందుకు నిర్ణయించుకున్నారు.

తల్లి సెంటిమెంట్ తో మంచి భావోద్వేగాలు ఉన్న ఈ సబ్జెక్టుని దర్శకరత్న నారాయణరావుగారు బాగా డీల్ చేయగలరనే ఏకాభిప్రాయానికి వచ్చారు . దాసరి ఫామ్ అప్పుడు ఎగుడుదిగుడుగా ఉంది. ప్రజా ప్రతినిధి, లంకేశ్వరుడు, టూ టౌన్ రౌడీ, రాముడు కాదు కృష్ణుడు,నియంత లాంటి భారీ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే మార్పు కోసం ఏదైనా ఎమోషనల్ డ్రామా తీయాలనే ఆలోచనలో ఉండగా ఈ ప్రతిపాదన వచ్చింది. మన నేటివిటీకి తగ్గట్టు కీలకమైన మార్పులతో స్క్రిప్ట్ సిద్ధం చేసి గణేష్ పాత్రోతో సంభాషణలు రాయించారు. టైటిల్ రోల్ కు శారదను తీసుకున్నారు. ఆవిడ భర్తగా సత్యనారాయణ నటించారు.

అక్టోబర్ లో షూటింగ్ మొదలుపెట్టుకున్న అమ్మ రాజీనామా కేవలం పాతిక రోజుల్లోనే పూర్తయ్యింది. ఇప్పటి ప్రసిద్ధ కెమెరామెన్ చోటా కె నాయుడు మొదటి సినిమా ఇది. ప్రేమాభిషేకం తర్వాత పదేళ్ల గ్యాప్ తో దాసరి- సంగీత దర్శకులు చక్రవర్తి కలిసి పని చేసిన చిత్రమిది. సాయికుమార్, రాజ్ కుమార్, బ్రహ్మానందం, రజిత, చలపతిరావు, ప్రసాద్ బాబు, బాబూమోహన్, శ్రీశాంతి, కవిత తదితరులు ఇతర తారాగణం. జీవితంలో పిల్లలు, భర్త ప్రవర్తన వల్ల విసుగు చెందిన ఓ తల్లి రిటైర్మెంట్ కోరుకునే పాయింట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. 1991 డిసెంబర్ 27న విడుదలైన అమ్మ రాజీనామాకు మహిళా ప్రేక్షకులే కాదు సగటు ఆడియన్స్ కూడా జై కొట్టారు.

Also Read : Rayalaseema Ramanna Chowdary : కలెక్షన్ కింగ్ 500వ మైలురాయి – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి