iDreamPost
android-app
ios-app

అమ్మ ఒడి.. నూతన అధ్యాయం ప్రారంభం

అమ్మ ఒడి.. నూతన అధ్యాయం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు చిత్తూరు న గరంలోని మున్సిపల్‌ పాఠశాలలో జరిగిన బహిరంగ సభలో ప్రజల మధ్యన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి పిల్లలను పాఠశాలకు పంపే తల్లులు దాదాపు 43 లక్షల మందికి ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

పిల్లలకు చదువే ఆస్తి అన్న సీఎం జగన్‌ వారికి చదువు చెప్పించేందుకు పేదింటి తల్లులకు ప్రతి ఏడాది 15 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. చదువుకోవాలంటే.. ముందు కడుపు నింపుకోవాలని పిల్లల చదవుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే లక్ష్యంతో ఈ పథకం రూపాందించామని సీఎం జగన్‌ తెలిపారు. పిల్లలకు 75 శాతం హాజరు తప్పక ఉండాలనే నిబంధనను ఈ ఏడాదికి మినహాయింపు ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి తప్పకుండా 75 శాతం హాజరు ఉండాలని స్పష్టం చేశారు.

అమ్మ ఒడి పథకానికి అర్హత ఉండి, ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయిన తల్లులు వచ్చే నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. విద్యకు తమ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ప్రజలకు సీఎం వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం పెట్టడానికి గల కారణాలు, మధ్యాహ్న భోజనం పథకంలో పౌష్టికాహారం ఇచ్చేందుకు చేసిన మార్పులు, మధ్యాహ్న భోజన నిర్వాహక కార్మికులకు జీతాల పెంపు, ఫీజు రియంబర్స్‌మెంట్‌తో ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి ఏడాది 20 వేలు సహాయం తదితర అంశాలను సీఎం జగన్‌ బహిరంగ సభలో వివరించారు.