కాల్చేయండి సర్.. చచ్చిపోతాం…

  • Published - 09:55 AM, Mon - 20 January 20
కాల్చేయండి సర్.. చచ్చిపోతాం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చాడో అప్పటినుండి అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాగా ఈరోజు మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే సమయంలో తమ నిరసనను తెలియచేయడానికి అమరావతి ప్రాంత రైతులు ప్రయత్నించారు.

పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి అమరావతి ప్రాంత రైతులు, గ్రామస్తులు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. కానీ పోలీసులు విధించే ఆంక్షలను కూడా లెక్కచేయకుండా అసెంబ్లీలోకి చొచ్చుకుపోవడానికి నిరసనకారులు రైతులు ప్రయత్నించారు. పోలీసులు రైతులు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ నలువైపుల నుండి భారీగా రైతులు నిరసనకారులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో పోలీసులు విధించిన ఆంక్షలను కూడా లెక్కచేయకుండా పంట పొలాలు కాలువల వెంబడి ముందుకు సాగారు.

అసెంబ్లీని చుట్టుముట్టిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేసారు. లాఠీ ఛార్జ్ చేసినా రైతులు వెనుదిరగకుండా తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాజధాని పరిసర గ్రామాల్లో ప్రజలు ఇళ్ళనుండి బయటకు రాకుండా పోలీసులు వలలను ఏర్పాటు చేయడం పలు నిరసనలకు తావిస్తుంది.

అమరావతి రోడ్లపైన కొందరు రైతులు నల్ల జెండాలు పట్టుకుని తమ నిరసనను తెలియజేసారు. రోడ్లపై నిరసన చేస్తున్న రైతులను అక్కడనుండి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఒక రైతు “రోడ్లపైకి నిరసన తెలియజేయడానికి వచ్చాము సర్.. మమ్మల్ని కాల్చేయండి సర్ చచ్చిపోతాం అంటూ వాపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు.

కాగా అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం మొదటినుండి చెప్పుకొస్తుంది. కానీ రాజధాని రైతులు మరియు ప్రతిపక్ష పార్టీలు ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Show comments