iDreamPost
android-app
ios-app

Alamuru Ex MLA, VVSS Chowdary, Mandapeta – మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్‌ చౌదరి మృతి

  • Published Dec 28, 2021 | 1:19 PM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
Alamuru Ex MLA, VVSS Chowdary, Mandapeta – మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్‌ చౌదరి మృతి

ఆలమూరు మాజీ ఎమ్మెల్యే… మండపేటకు చెందిన రాజకీయ దిగ్గజం వీవీఎస్‌ఎస్‌ చౌదరి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. చివరి క్షణాల్లో ఆయన భార్య సత్యవతి, మేనళ్లుడు, ప్రస్తుత మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు వెంటే ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని మండపేట తరలిస్తున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వీవీఎస్‌ఎస్‌ చౌదరికి మండపేటలో మంచి పట్టు ఉంది. పాత ఆలమూరు నియోజకవర్గం (పునర్విభజనలో కొంత భాగంగా కొత్తపేట, మరికొంత భాగం మండపేటలల్లో కలిసింది) నుంచి ఆయన రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున పోటీ చేసి విజేతగా నిలిచారు. 1994లో రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి మీద, 1999లో డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జున చౌదరి మీద గెలుపొందారు. 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసినా ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి బిక్కిన కృష్ణార్జున చౌదరి మీద ఓటమి పాలయ్యారు. 2009 నాటికి నియోజకవర్గ పునర్విభజనలో టీడీపీ చౌదరికి టిక్కెట్‌ నిరాకరించింది. అతనిని కాదని సమీప బంధువు, వరుసకు మేనల్లుడు అయిన ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు సీటు కేటాయించారు. దీనితో ఆగ్రహించిన వీవీఎస్‌ఎస్‌ చౌదరి ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైనా గణనీయంగా ఓట్లు సాధించారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు గెలవగా, వీవీఎస్‌ఎస్‌ చౌదరి ద్వితీయస్థానంలో నిలిచారు. ఇక్కడ అధికారపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బిక్కిన కృష్ణార్జున చౌదరి మూడవస్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల నాటి నుంచి వీవీఎస్‌ఎస్‌ చౌదరి రాజకీయాలకు దూరమయ్యారని చెప్పవచ్చు. తరువాత టీడీపీలో చేరినా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గడిచిన రెండు ఏళ్లుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.