40 ఏళ్ళ తర్వాత ANR సినిమాకు మోక్షం

లెజెండరీ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారికీ ఈ ఇబ్బంది తప్పలేదు.

లెజెండరీ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారికీ ఈ ఇబ్బంది తప్పలేదు.

విడుదల ఆగిపోయే కష్టాలు చిన్న సినిమాలకే కాదు పెద్ద హీరోలకూ అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. లెజెండరీ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారికీ ఈ ఇబ్బంది తప్పలేదు. ఎప్పుడో 1982లో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ గుమ్మం దగ్గర ఆగిపోయి ఇప్పటికీ మోక్షం దక్కించుకోని ప్రతిబింబాలు అనే చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 20 ఏఎన్ఆర్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని థియేటర్లలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వర్గీయ కెఎస్ ప్రకాష్ రావు(రాఘవేంద్రరావు తండ్రి)దీనికి దర్శకత్వం వహించగా ఆయన కాలం చేశాక మిగిలిపోయిన భాగాన్ని సింగీతం శ్రీనివాసరావు పూర్తి చేసి ప్రతిబింబాలు సిద్ధం చేశారు.


ఏవో ఆర్థిక కారణాలతో అప్పటి నుంచి ఇది ల్యాబ్ లోనే మగ్గుతూ వచ్చింది. అక్కినేని బ్రతికున్న టైంలోనూ బయటికి తెచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవీ ఫలించలేదు. లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ ని ఇటీవలే క్లియర్ చేశారట. ఇందులో జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి వెండితెరపై మరోసారి తమను తాము కొత్తగా చూసుకునే అదృష్టం దక్కింది. గుమ్మడి, కాంతారావు లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళు కాలం చేయడంతో అభిమానులకు ఇదో తీపి జ్ఞాపకం అవుతుంది. ప్రతిబింబాలు ఎమోషనల్ కం లవ్ స్టోరీగా రూపొందింది. కలర్ గ్రేడింగ్, డిటిఎస్ తదితర సాంకేతిక పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాకు నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ. అయినా కొత్త సినిమాలకే జనం థియేటర్లకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో పాత ఫార్ములాలో రూపొందిన ప్రతిబింబాలు చూసేందుకు జనం వస్తారా అంటే చెప్పలేం కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా చూస్తారు. ఆడియో కూడా బాగుంటుందట. 1981లో ప్రేమాభిషేకం ఇండస్ట్రీ హిట్ అయ్యాక ఏఎన్ఆర్ కు ఒక్కసారిగా ఆ జానర్ లో చేసే సినిమాలు చాలా వచ్చాయి. కొన్ని హిట్టయ్యాయి కొన్ని పోయాయి. ఒక్క ఈ ప్రతిబింబాలు మాత్రమే ఇలా బయటికి రాకుండా నాలుగు దశాబ్దాలు ఎదురు చూసింది. పోకిరి, ఒక్కడు, జల్సా, ఘరానా మొగుడు లాంటి రీ రిలీజుల ట్రెండ్ లో అక్కినేని ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటారో చూడాలి

Show comments