iDreamPost
android-app
ios-app

స‌బ్ ఎడిట‌ర్‌గా అక్కినేని – Nostalgia

స‌బ్ ఎడిట‌ర్‌గా అక్కినేని – Nostalgia

రిపోర్ట‌ర్‌గా హీరోని చూపించిన సినిమాలు చాలా వున్నాయి. స‌బ్ ఎడిట‌ర్‌గా హీరో వున్న సినిమా ఒకే ఒక్క‌టుంది. దాని పేరు పెళ్లిసంద‌డి. 1959లో వ‌చ్చిన ఈ సినిమాలో పెళ్లి సంద‌డంటూ ఏమీలేదు. టైటిల్ జ‌స్టిఫికేష‌న్ కోసం శుభం కార్డు షాట్‌లో ఆ మాట అంటారంతే!

1988 నుంచి 2002 వ‌ర‌కూ 14 ఏళ్లు ఎదుగూబొదుగూ లేకుండా నేను స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేసా. పాత ఆంధ్ర‌జ్యోతి మూసేయ‌గా, కొత్త ఆంధ్ర‌జ్యోతిలో నాకు ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. డెస్క్‌లో ప‌నిచేసే స‌బ్ ఎడిట‌ర్ ఉద్యోగం ఒకటి వుంటుంద‌ని బ‌య‌ట చాలా మందికి తెలియ‌దు. జ‌ర్న‌లిస్ట్ అంటే రిపోర్ట‌ర్ అనే అనుకుంటారు.

పెళ్లి సంద‌డిలో అక్కినేని పిడుగు అనే ప‌త్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్టు నేమ్‌ప్లేట్ వుంటుంది. అంతే త‌ప్ప ప‌త్రికాఫీస్‌లో ప‌ని చేస్తున్న సీన్స్ వుండ‌వు. వాస్త‌వానికి హీరో ANR ఒక జ‌మిందారు కొడుకు. అయితే క‌నీసం ఒక ఏడాది అజ్ఞాత‌వాసం వేసే ఆచారం వాళ్ల‌కి వుంటుంది. అంటే జ‌మిందార్ పేరు చెప్ప‌కుండా ఏడాది స్వ‌శ‌క్తితో బ‌త‌కాలి. ఈ పాయింట్ సినిమాలో ఎలివేట్ కాలేదు కానీ, దీన్నే కొంచెం ట్విస్ట్ చేస్తే బిచ్చ‌గాడు క‌థ‌వుతుంది.

క‌థ చెప్పాలంటే పెళ్లి చూపుల‌కి వెళ్ల‌డం ఇష్టం లేని చ‌లం త‌న Placeలో ANR ని పంపుతాడు. అక్క‌డికి వెళ్లి హీరోయిన్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. కామెడి ఆఫ్ ఎర్ర‌ర్స్‌తో క‌థ న‌డుస్తుంది.

మిస్టేక‌న్ ఐడెంటిటీతో ఎన్ని సినిమాలు వ‌చ్చాయో లెక్క చెప్ప‌డం క‌ష్టం. ఈ జాన‌ర్‌లో చిత్‌చోర్ (హిందీ) అద్భుత సినిమా. దీన్ని తెలుగులో జ‌య‌సుధ చంద్ర‌మోహ‌న్‌తో అమ్మాయి పెళ్లి అని తీసారు. అట్ట‌ర్ ప్లాప్‌.

త‌ర్వాతి రోజుల్లో ఒక్క వెలుగు వెలిగిన బి.స‌రోజాదేవి దీంట్లో సెకెండ్ హీరోయిన్‌గా చ‌లంకి జోడిగా న‌టించ‌డం విచిత్రం.

హీరోయిన్‌ని హీరో ర‌క్షించ‌డం, ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ‌డం అప్ప‌టి సినిమాల్లో ఈ సీన్‌ని అర‌గ‌దీసారు. దీంట్లో కూడా అంజ‌లిని పాము కాటేస్తే , విషాన్ని నోటితో పీల్చి ANR కాపాడుతాడు. డాక్ట‌ర్‌గా కాంతారావు గెస్ట్‌రోల్ వేసాడు.

చివ‌ర‌ల్లో హీరోయిన్ ఇల్లు వ‌దిలి వెళుతుంది. కొండ‌కోన‌ల్లో ఆమె న‌డుస్తూ వుంటే, వెతుకుతూ అంద‌రూ ప‌రిగెత్తుతుంటారు. ఈ క్లైమాక్స్ ఎన్ని సినిమాల్లో వుందో చెప్ప‌లేం.