తీవ్రమైన పోటీ మధ్య తెలివైన తెగింపు

సంక్రాంతికి నువ్వా నేనానే స్థాయిలో జరుగుతున్న పోటీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ధీటుగా నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ సినిమా వారసుడుని భారీ ఎత్తున ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఎంత రాద్ధాంతం జరుగుతున్నా తెరవెనుక వ్యవహారాలు చక్కగా జరిగిపోతున్నాయి. ప్రమోషన్ల పరంగా చిరంజీవి బాలయ్యలే ఇంకా వెనుకబడి ఉన్నారు. రెండు సినిమాల షూటింగ్ చివరి దశలో ఉండటంతో మైత్రి బృందం ఆ ఒత్తిడిలో ఇంకా పబ్లిసిటీ వేగం పెంచలేదు. వారసుడుకి సంబంధించి ఆల్రెడీ రెండు లిరికల్ వీడియోస్ వచ్చేసి యుట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

తాజాగా రేస్ లో అజిత్ తునివు తోడయ్యింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సమాంతర విడుదల ఉంటుందా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ థియేట్రికల్ రైట్స్ ఇచ్చేశారు. తెగింపు టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టేనని సమాచారం.కేవలం మూడు కోట్లకు డీల్ పూర్తయ్యిందని వినికిడి. ఒకవేళ టాక్ కనక పాజిటివ్ గా వస్తే ఈ మొత్తం చాలా ఈజీగా రికవర్ అవుతుంది. ఇంత తక్కువ మొత్తాన్ని ఫిక్స్ చేయడానికి కారణం ఉంది. తెగింపుకి ఏపీ తెలంగాణలో ఎక్కువ స్క్రీన్లు దొరికే ఛాన్స్ లేదు. అజిత్ కి ఇక్కడ చాలా పరిమిత మార్కెట్ ఉంది. పైగా వలిమై లాంటి గత చిత్రాలు ఇక్కడ అద్భుతాలు చేసే స్థాయిలో ఆడలేదు. అందుకే రీజనబుల్ గా క్లోజ్ చేశారు.

ఎలా చూసుకున్నా అజిత్ ది తెలివైన తెగింపుగా చెప్పుకోవాలి. ఎలాగూ తమిళ వెర్షన్ నుంచే నిర్మాతకు భారీ లాభాలు కన్ఫర్మ్ కావడంతో ఇతర బాషల గురించి బోనీ కపూర్ అతిగా ఆలోచించడం లేదు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో అజిత్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించాడు. హీరోయిన్ అంటూ ఎవరు ఉండరు. మంజు వారియర్ కు యాక్షన్ టచ్ ఉన్న పాత్ర దక్కింది. ఒకటి రెండు పాటలకే పరిమితమవుతున్నారు. తెగింపుకు ఇప్పటికైతే క్రేజ్ లేదు కానీ క్రమంగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉందని వర్కింగ్ స్టిల్స్ చూస్తే అర్థమవుతోంది.గ్యాంబ్లర్ తర్వాత అజిత్ కు ఆ స్థాయి సక్సెస్ ఇక్కడ మళ్ళీ దక్కలేదు. ఈ తెగింపు ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి

Show comments