iDreamPost
android-app
ios-app

డ్రైవర్ జమున రిపోర్ట్

  • Published Dec 31, 2022 | 5:57 PM Updated Updated Dec 31, 2022 | 5:57 PM
డ్రైవర్ జమున రిపోర్ట్

మూడేళ్ళ క్రితం కౌసల్య కృష్ణమూర్తితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది కానీ ఆ స్థాయిలో మళ్ళీ గుర్తింపు రాలేదు. నాని టక్ జగదీశ్, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ లో నటించినప్పటికీ అవేవి ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడంతో తెలుగమ్మాయే అయినా అవకాశాల కోసం ఎదురీదక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వచ్సిన మరో కొత్త మూవీ డ్రైవర్ జమున. కనీస స్థాయిలో పబ్లిసిటీ చేయకపోవడంతో అసలీ చిత్రం వచ్చిందనే సంగతే ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. నిన్న ఒకేసారి అయిదారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేయడంతో సైలెంట్ అయ్యింది. ఇంతకీ మ్యాటర్ ఉందో లేదో చూద్దాం

క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగించే జమున(ఐశ్వర్య రాజేష్)కు జబ్బుతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడమే ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే రిస్క్ అనిపించినా టాక్సీ రైడ్స్ తో వచ్చే ఆదాయంతో అమ్మకు మందులు, ఇంటి ఖర్చులు మేనేజ్ చేస్తుంది. ఓ గ్యాంగ్ జమున క్యాబ్ ని బుక్ చేసుకుంటుంది. వాళ్ళ మాటలను బట్టి మాజీ మంత్రి(ఆడుకాలం నరేన్)ని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది పోలీసులు వెతుకుతున్న విషయం అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రతి నిమిషం తనకు గండంగా మారుతుంది. ఇంతకీ వాళ్ళు జమునకు నిజం తెలిసిన సంగతి కనుక్కున్నారా ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ

స్టోరీ లైన్ నిన్న రిలీజైన ఆది సాయికుమార్ టాప్ గేర్ కు కొద్దిగా దగ్గరగా ఉండటం కాకతాళీయం. దర్శకుడు కిన్ స్లిన్ పాయింట్ రాసుకున్నంత ఎగ్జైటింగ్ గా స్క్రీన్ ప్లే ని సెట్ చేసుకోలేదు. ఫలితంగా థ్రిల్లర్ మోడ్ లో సాగాల్సిన డ్రైవర్ జమున కారు విపరీతమైన ల్యాగ్ తో ఎద్దుల బండి ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. నిడివి కేవలం గంటన్నరే ఉన్నప్పటికీ బోర్ కొట్టిందంటే అది ముమ్మాటికీ రైటింగ్ లోపమే. జమున ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అన్నీ చప్పగా సాగుతాయి. ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్ ఒకటే ఇందులో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్. ఓటిటికి ఇవ్వకుండా థియేటర్ కు ఎందుకొచ్చారో కానీ ప్రేక్షకుడు మాత్రం టికెట్ కొన్నందుకు ఖచ్చితంగా ఫీలవుతాడు