iDreamPost
android-app
ios-app

మజ్లిస్ వేగానికి బ్రేకులు వేసిన బెంగాల్!

మజ్లిస్ వేగానికి బ్రేకులు వేసిన బెంగాల్!

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన పోటీ కి సై అనడమే కాకుండా, ఊహించని స్థాయిలో ఓట్లు, సీట్లు సాధిస్తూ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నఅసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఏఐఎం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడింది. బెంగాలీ ఎన్నికల్లో కచ్చితంగా తగిన సీట్లు సాధిస్తుందని అనుకున్న మజ్లిస్ పార్టీ పోటీచేసిన 7 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ముస్లిం లు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో అద్భుతం గా రాణిస్తున్న ఎంఐఎంను బెంగాల్ ప్రజలు మాత్రం తిరస్కరించారు.

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలతో పాటు ఏర్పాటు అయిన ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ లో ఎంఐఎం భాగమై పోటీకి నిలిచింది. పొత్తులో భాగంగా ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు స్థానాల్లో మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. ముఖ్యంగా బీహార్ కు సరిహద్దు గా ఉండే ప్రాంతాలు ముస్లిం ప్రభావం అధికంగా ఉన్న ఉత్తర దినాజ్పూర్, మాల్దా జిల్లాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను పోటీకి పెట్టింది. అయితే ఇటీవల అన్ని ఎన్నికల్లో మంచి ప్రభావం చూపుతూ వస్తున్న మజ్లీస్ కు బెంగాల్ ప్రజలు అంతగా ప్రభావం కాలేదు. బెంగాల్ శాసన సభ ఎన్నికలు ఈసారి తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అనే కోణంలోనే జరగడంతో పాటు లెఫ్ట్ కాంగ్రెస్ కూటమికి ఏమాత్రం ఓట్లు సీట్లు రాలేదు. వారి కూటమిలోని పోటీకి దిగిన ఎంఐఎం కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. పలుమార్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను అధిగమించ లేక పోయారు.

పశ్చిమ బెంగాల్ లో దాదాపు 30 శాతం పైగా ముస్లిం జనాభా ఉన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ కు ఆనుకుని ఉన్న తొమ్మిది జిల్లాల్లో ముస్లిం ప్రభావం బాగా అధికం. దీంతో కచ్చితంగా ఎంఐఎం ఇక్కడ మంచి సీట్లు సాధిస్తుందని భావించారు. అందులోనూ కూటమిలో ఎంఐఎంకు ముస్లిం ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే సీట్లు ఇచ్చారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించి సత్తా చాటిన ఎంఐఎం మరోపక్క గుజరాత్ లోని గోద్రా స్థానిక సంస్థల్లో కూడా తగిన ప్రభావం చూపడంతో కచ్చితంగా బెంగాలీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే వాటిని తోసిరాజని ఫలితాలు రావడం ఇప్పుడు మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురిచేసింది.

మజ్లిస్ పార్టీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దెబ్బతీశారని చెప్పుకోవచ్చు. ముస్లిం ఓట్లను గంపగుత్తగా తనవైపు తిప్పుకునేందుకు ఆమె వెస్ట్ బెంగాల్ ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు ఆ పార్టీ నేతలు అందరిని ఎన్నికలకు ముందే తృణమూల్ కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చారు. వివిధ ప్రభావాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి బెంగాల్ లో వచ్చింది. దీంతో ఒకానొక దశలో పోటీకి సైతం అసదుద్దీన్ ఓవైసీ ఆలోచించే పరిస్థితి కనిపించింది. దీంతో వంటరిగా ఎన్నికలకు వెళ్దాం అని భావించిన మజ్లీస్ పార్టీ అధినేత ఆలోచనలు మమతా దెబ్బకు అడియాసలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమిలో చేరిన మజ్లిస్ పార్టీ కేవలం ఏడు చోట్ల లోనే పోటీకి నిలిచిన అక్కడ ప్రాతినిధ్యం లభించలేదు. పోటీచేసిన చోట్ల సైతం కనీసం రెండో స్థానంలో కూడా నిలిచే పరిస్థితి ఎంఐఎంకు లేకపోవడంతో హైదరాబాద్ పార్టీ ఉత్సాహానికి బెంగాల్లో బ్రేకులు పడినట్లు అయింది.

Also Read : నందిగ్రామ్‌లో హైడ్రామా.. మమత ఓటమి..?