iDreamPost
iDreamPost
అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల ఆంక్షలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. వీరి ఆగడాలకు మహిళా టీవీ యాంకర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. కానీ, తాజాగా తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలను కాదని సదరు యాంకర్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రముఖ టీవీ ఛానెళ్లలో మహిళా యాంకర్లు తమ ముఖాలను కప్పుకోకుండా లైవ్ ప్రసారంలో కనిపించడమే అసలు చర్చకు కారణం. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ ఆదేశాలతో మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు.
తాలిబన్ల కొత్త ఆదేశాల ప్రకారం మహిళలందరూ సంప్రదాయ బుర్ఖా ద్వారా తమ ముఖాలతో సహా పూర్తిగా కప్పుకోవాలని అఫ్గానిస్తాన్ అత్యున్నత నాయకుడు హైబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు రాక ముందు కేవలం తలను మాత్రమే కప్పుకునేవారు యాంకర్లు. అయితే తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో నాయకుడి ఆదేశాలు పాటించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు.
కానీ, ఇవాళ ముఖాలను కప్పుకోమన్న వ్యక్తులు, రేపటి రోజున అసలు పని చేయడమే మానేయాలనే ఆదేశాలు ఇచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. ఈ కారణం చేతనే హైబతుల్లా ఆదేశాలను ఖాతరు చేయకుండా టోలోన్యూస్, షంషాద్ టీవీ, 1టీవీ వంటి బ్రాడ్ కాస్టర్లు నేరుగా మహిళల ముఖాలు కనిపించేలా కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.ఈ అంశంపై తాలిబన్లతోనూ తదుపరి చర్చలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక రోజురోజుకు తాలిబన్ల కఠినమైన ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీస స్వేచ్ఛ కూడా లేకపోవడంతో అనేకమంది ఆ దేశాన్నే విడిచి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.