iDreamPost
android-app
ios-app

దేశం కోసం.. వెన్నునొప్పిని లెక్కలేయకుండా బరిలోకి దిగాడు!

  • Published Oct 17, 2023 | 3:57 PM Updated Updated Oct 17, 2023 | 3:57 PM
  • Published Oct 17, 2023 | 3:57 PMUpdated Oct 17, 2023 | 3:57 PM
దేశం కోసం.. వెన్నునొప్పిని లెక్కలేయకుండా బరిలోకి దిగాడు!

దేశాన్ని గెలిపించాలనే పట్టుదల, ఐదుసార్లు వరల్డ్‌ ఛాంపియన్లుగా ఉన్న తాము వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నామనే కోపం.. ఆ క్రికెటర్‌లో కసిని పెంచింది. వెన్ను నొప్పి వేధిస్తున్నా.. కచ్చితంగా గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో బరిలోకి దిగి జట్టును గెలిపించాడు. వెన్నునొప్పి తీవ్రమైతే మొత్తం టోర్నీకే దూరం అయ్యే ప్రమాదం ఉందని తెలిసినా, తన కెరీర్‌కు కూడా నష్టమని తెలిసినా కూడా దేశం కోసం తెగించి బరిలోకి దూకాడు.. ఏకంగా 4 వికెట్లతో సత్తా చాటి తన టీమ్‌కు వరల్డ్‌ కప్‌లో తొలి విజయాన్ని అందించాడు. అతనే.. ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా. వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో తొలి విజయాన్ని అందుకుంది.

ఇండియా, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ఆసీస్‌.. శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అయితే.. ఆరంభంలో శ్రీలంక చూపించిన దూకుడు చూసి.. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్‌ను ఓటమి వెక్కిరిస్తుందా అనిపించింది. ఎందుకంటే.. పటిష్టమైన బౌలింగ్‌ లైనప్‌ ఉన్న ఆస్ట్రేలియాపై.. లంక ఓపెనర్లు ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. పథుమ్‌ నిస్సంకా, కుసల్‌ పెరీరా ఆసీస్‌ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ.. తొలి వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు. ఇక లంక 300లకు పైగా భారీ స్కోర్‌ చేస్తుందని అంతా భావించారు.

కానీ, ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ జోడీని విడదీశాడు. 61 పరుగులు చేసిన నిస్సంకా ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కొద్ది సేపటికి మరో ఓపెనర్‌ పెరీరాను కూడా కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. ఇలా ఇద్దరు సెటిల్‌ అయిన బ్యాటర్లు అవుట్‌ అవ్వడంతో ఆసీస్‌కు మ్యాచ్‌పై పట్టుదొరికింది. ఈ ఛాన్స్‌ను ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ జంపా క్యాష్‌ చేసుకున్నాడు. మరే బ్యాటర్‌ను కూడా క్రీజ్‌లో కుదురుకోకుండా చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న కుసల్‌ మెండీస్‌, సమరవిక్రమలను అవుట్‌ చేసి.. ఆసీస్‌ వైపు మ్యాచ్‌ను తిప్పేశాడు. వీరిద్దరితో పాటు కరుణరత్నే, మహీష తీక్షణలను అవుట్‌ చేసి.. మొత్తం నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 125 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. జంపా దెబ్బకు 209 పరుగులకే ఆలౌట్‌ అయింది.

ఈ టార్గెట్‌ను 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ 52 పరుగులతో రాణించాడు. అలాగే జోష్‌ ఇంగ్లిస్‌ 58 రన్స్‌తో మంచి ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరితో పాటు మార్నస్‌ లబుషేన్‌ 40, మ్యాక్స్‌వెల్‌ 31 పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. వెన్నునొప్పిని సైతం లెక్కచేయకుండా ఆసీస్‌ విజయం కోసం జంపా చూపించిన తెగువపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుతం.. 5 వికెట్లతో చెలరేగిన KKR బౌలర్