iDreamPost
iDreamPost
కరోనా వల్ల రెండేళ్ల పాటు జరుపుకోలేకపోయిన కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మరో 12 రోజుల పాటు జరిగే ఈ సంరంభంలో అతిరధ మహారథులు పాల్గొంటున్నారు. టాప్ అవార్డు కోసం 21 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో మనదేశంలో ఇంకా విడుదల కానీ మాధవన్ రాకెట్రీ కూడా ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఇండియాకు అఫీషియల్ కంట్రీ అఫ్ హానర్ అందటం పరిశ్రమకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటిదాకా వెళ్లిన సెలబ్రిటీల వైపు చూస్తే దీపికా పదుకునే ఇవాళ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తన గ్లామర్ తో సోయగాలతో ఫోటోగ్రాఫర్లకు చేతి నిండా పనిని అప్పగించింది.
తమన్నా భాటియా, నవాజుద్దీన్ సిద్ధిక్, ఏఆర్ రెహమాన్ ఇప్పటికే రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు. సౌత్ నుంచి పూజా హెగ్డే హాజరు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఊర్వశి రౌతేలా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కమల్ హాసన్ చేరుకోవడం పట్ల అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. క్రమంగా మన దేశం తరఫున హాజరవుతున్న ప్రముఖుల లిస్టు పెరిగిపోతోంది. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళను పిలవాలని దక్షిణాది అభిమానులు కోరుకుంటున్నారు కానీ అది వచ్చే సంవత్సరం తీరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, బాహుబలిల ప్రభావం గట్టిగానే ఉంది మరి.
ఇక ఇండియా నుంచి ఎంపికైన సినిమాలను చూస్తే మాధవన్ ‘రాకెట్రీ – ది నంబ్రి ఎఫెక్ట్’ మొదటి స్థానంలో ఉంది. నిఖిల్ మహాజన్ ‘గోదావరి’, అచల్ మిశ్రా ‘దుఇన్’, శంకర్ శ్రీకుమార్ ‘ఆల్ఫా బీట గమ్మా’, బిశ్వజిత్ బోరా ‘బూమ్బా రైడ్’, జయరాజ్ ‘ట్రీ ఫుల్ అఫ్ పారట్స్’ మిగిలిన స్థానాలను తీసుకున్నాయి. వీటిలో ఏది ఫైనల్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇవి కాకుండా పాత తరం సత్యజిత్ రే క్లాసిక్స్ ని కూడా ఇందులో ప్రదర్శించబోతున్నారు. విదేశీ చిత్రాలతో పోటీ పడుతూ వీటిలో ఏవి ఉనికిని చాటుతాయో వేచి చూడాలి. మొత్తానికి సినిమాలు తారలు చూసేందుకు రెండు కళ్ళు చాలవనేలా కేన్స్ 2022 అంగరంగ వైభవంగా జరుగుతోంది