iDreamPost
android-app
ios-app

TDP, Srikakulam, Atchannaidu – సిక్కోలు సీనియర్లకు అచ్చెన్న ఎసరు!

  • Published Jan 02, 2022 | 5:49 AM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
TDP,  Srikakulam, Atchannaidu – సిక్కోలు సీనియర్లకు అచ్చెన్న ఎసరు!

వరుస ఓటములతో నేలబారు స్థితికి చేరుకున్న తెలుగుదేశం పార్టీని మళ్లీ నిలబెట్టడానికి పార్టీ అధినేత చంద్రబాబు నానాపాట్లు పడుతుంటే.. మరోవైపు పార్టీ అగ్రనేతలు జిల్లాలో తమ ఆధిపత్యం కోసం గ్రూపులను ఎగదోస్తున్నారు. ఫలితంగా టీడీపీ పరిస్థితి ఒకడుగు ముందుకి.. మూడడుగులు వెనక్కి అన్నట్లు మారింది.

శ్రీకాకుళం పార్లమెంటు జిల్లాలో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడే నియోజకవర్గాల్లో ఇంఛార్జీలకు వ్యతిరేకంగా తెరవెనుక కొత్త నేతలను ప్రోత్సహిస్తూ సరికొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతల హడావుడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని ప్రచారం చేసుకుంటుండటం.. ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో ఉన్న సీనియర్ నేతలను ఇబ్బంది పెడుతోంది. ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కొందరు నేతలు ఇదే విషయం ప్రశ్నించడం, ఒక నాయకుడు ఏకంగా గైర్హాజరు కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

అనుయాయులను అందలం ఎక్కించేందుకే..

సీనియర్లను పక్కకు తప్పించి తన అనుయాయులను అందలం ఎక్కించేందుకు కొన్నాళ్లుగా అచ్చెన్న పావులు కదుపుతున్నారు. కొంతకాలంగా చాప కింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారం మూడు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశం, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బయటపడటంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్న ఎగదోస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు పోటీ చేస్తారా.. లేదా అన్నది పక్కన పెడితే దీని వల్ల పార్టీ మరింత దిగజారుతుందన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఉండగా ఆయన్ను కాదని మరో నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మామిడి గోవిందరావును అచ్చెన్న తెరపైకి తెచ్చారు. ఆయన్ను నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి రూ.లక్ష విరాళం ఇప్పించారు. ఆ ఫోటోను ఫ్లెక్సీల్లో వేయించి నియోజకవర్గమంతటా పెట్టించి ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ అని చెప్పుకొంటున్నారు. దీంతో అలిగిన కలమట ఇటీవల జరిగిన పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశానికి గైర్హాజరయ్యారు.

పలాస నియోజకవర్గంలో గౌతు కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇంఛార్జి గౌతు శిరీషకు పట్టులేదని, పదవిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం అక్రమాలకు పాల్పడిందన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ప్రత్యామ్నాయంగా జుత్తు తాతారావు అనే నేతను ప్రమోట్ చేస్తున్నారు. ఆయన టికెట్ తనదే అని ప్రచారం మొదలుపెట్టారు. ఆయన వెనుక అచ్చెన్న ఉన్న విషయం గుర్తించిన శిరీష పార్టీ సమావేశంలో ప్రస్తావించి నిరసన తెలిపారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా పొందూరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడును ప్రోత్సహిస్తున్నారు. కళా నియంతృత్వ పోకడలు కూడా కలిశెట్టికి కలిసి వస్తున్నాయి. స్థానిక నినాదంతో తెరపైకి వచ్చిన ఆయన అచ్చెన్న సహకారంతో నేరుగా చంద్రబాబు, లోకేష్ లతో సంబంధాలు పెట్టుకోగలిగేలా సహకరించారన్న చర్చ జరుగుతోంది.