iDreamPost
android-app
ios-app

ఏబీ వెంకటేశ్వరరావు చివరి ప్రయత్నం

ఏబీ వెంకటేశ్వరరావు చివరి ప్రయత్నం

అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ఏపీ ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని, అరెస్ట్‌ చేయాలని యోచిస్తోందని.. వేధింపుల నుంచి కాపాడాలంటూ ఆయన ఐపీఎస్‌ అధికారుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ విభాగం అధ్యక్షుడు ద్వారకా తిరుమల రావుకు లేఖ రాశారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ఏబీ చివరి ప్రతయ్నంగా లేఖ రాసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆశించిన ఫలితం వస్తుందా..? రాదా..? అనే అనుమానాలతో రక్షణ కోసం ఐపీఎస్‌ అధికారుల సంఘాన్ని ఆశ్రయించినట్లు చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారు. ఆ సమయంలో విదేశీ పరికాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆయనపై అభియోగాలు దాఖలయాయి. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లబ్ధిపొందారనే అభియోగాలున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఆయన సస్పెండ్‌ అయ్యారు. సస్పెన్షన్‌ పై ఏపీ హైకోర్టును, క్యాట్‌ను, సుప్రిం కోర్టును కూడా ఏబీ ఆశ్రయించారు. అయినా ఏబీ ఆశించిన ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలోనే సదరు కేసు నుంచి తప్పించుకునేందుకు ఉన్న చివరి ప్రయత్నాలను ఏబీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. పనితీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. టీడీపీకి అనుకూలంగా పని చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం కోసం పని చేయాల్సిన ఏబీ.. తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో టీడీపీకి లబ్ధిచేకూర్చేలా వ్యవహరించారనే బలమైన విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి.. అందుకు అనుగుణంగా ఎలా పని చేయాలో టీడీపీ నేతలకు సందేశాలు పంపేవారని వైసీపీ నేత విజయాసాయి రెడ్డి ఎన్నికల సమయంలో ఆరోపించడం సంచలనమైంది. ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారశైలిపై స్పష్టమైన అవగాహన ఉన్న ఐపీఎస్‌ అధికారుల సంఘం.. ఏబీ రాసిన లేఖపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.