iDreamPost
android-app
ios-app

AAP, Goa, Affidavits – ఫిరాయింపులకు అఫిడవిట్ విరుగుడు! గోవాలో కొత్త విధానం

  • Published Jan 02, 2022 | 9:16 AM Updated Updated Jan 02, 2022 | 9:16 AM
AAP,  Goa, Affidavits –  ఫిరాయింపులకు అఫిడవిట్ విరుగుడు! గోవాలో కొత్త విధానం

ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయినవారు అధికార పార్టీలోకి జంప్ చేయడం రాజకీయాల్లో కామన్ అయిపోయింది. పూర్తి మెజారిటీ రాకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య సీట్ల తేడా స్వల్పంగా ఉన్న సందర్భాల్లో ఎమ్మెల్యేల పార్టీ మార్పిడులు మరింత ఎక్కువగా ఉంటాయి. అధికారం చేపట్టే అవకాశం ఉన్న పార్టీలోకి మారేందుకు రకరకాల ప్రయోజనాలను ఆశించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపుతుంటారు. గోవాలో అయితే ఇటువంటివి విచ్చలవిడిగా జరుగుతుంటాయని గత చరిత్ర పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఆయారాం గాయారాం సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త ఆలోచన చేసింది. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు పోటీకి సిద్ధం అవుతున్న ఆ పార్టీ తమ అభ్యర్థుల నుంచి పోటీకి ముందే పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని హామీ ఇస్తూ వ్యక్తిగత అఫిడవిట్లు తీసుకోవాలని నిర్ణయించింది.

అఫిడవిట్ కాపీలు ఓటర్లకు

ఎన్నికల్లో పోటీ చేసే నేతల నుంచి.. అభ్యర్థిగా బీ ఫారం ఇచ్చే సమయంలోనే అఫిడవిట్ పై వారి సంతకం తీసుకుంటామని ఆప్ రాష్ట్ర నాయకుడు అమిత్ పాలేకర్ వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని హామీ ఇస్తున్నట్లుగా అఫిడవిట్లో పొందుపరుస్తారు. ఇవి చట్టపరంగా చెల్లుబాటు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటి కాపీలను ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లకు పంపిణీ చేస్తారు. గెలిచిన తర్వాత ఎవరైనా పార్టీ మారితే సదరు ఎమ్మెల్యే నియోజకవర్గ ఓటర్లతో పాటు పార్టీ కూడా కోర్టుకు వెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పాలేకర్ చెప్పారు. పార్టీ మారినవారు వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హులవుతారన్న నిబంధన కూడా అఫిడవిట్లో చేర్చినట్లు ఆయన చెప్పారు.

విశృంఖలంగా పార్టీ మార్పిళ్లు

పార్టీ మార్పిడులకు గోవా రాష్ట్రం పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఆ సంస్కృతి పాతుకుపోయింది. 2019లో ఏకంగా పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దూకి అధికార బీజేపీలో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత మూడు నెలల్లో పలు పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. ఇక ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో టికెట్ పొందిన అలెక్సో రెజినాల్డో దాన్ని తిరస్కరించి మరీ తృణమూల్ కాంగ్రెసులో చేరిపోయారు. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పార్టీ మార్పిళ్లు మరింత పెరుగుతాయన్న అంచనాతోనే ఆప్ ముందు జాగ్రత్త చర్యగా అఫిడవిట్ పద్ధతి తీసుకొచ్చింది.