సంపాదించుకోవాల్సింది ఆ నలుగురినే – Nostalgia

బ్రతికినన్నాళ్ళు నలుగురితో మంచిగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని చాటిన గొప్ప సినిమా ఆ నలుగురు. కామెడీ హీరోగానే ప్రేక్షకులకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్ లోని మరో ఎమోషన్ ని బయటికి తీసుకొచ్చిన అరుదైన చిత్రాల్లో ఇదీ ఒకటి. మెప్పించేలా చూపిస్తే ఎంత సందేశం ఉన్నా ఎంత సెంటిమెంట్ జొప్పించినా జనం ఆదరిస్తారని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. పెళ్ళైన కొత్తలో దర్శకుడు మదన్ తన కెరీర్ ప్రారంభంలో అంతిమయాత్ర అనే కథ రాసుకున్నారు. దాన్ని సీరియల్ గా తీయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఛానల్ నో అనేశాయి.

ముందు నిర్మాత అట్లూరి పూర్ణచందర్ రావు సినిమాగా చేసేందుకు సరే అన్నారు. మదన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. హీరోగా భాగ్య రాజ్, దాసరి. మోహన్ బాబు ఇలా ఏవేవో ఆప్షన్లు. ఏదీ సెట్ కాలేదు. ఈలోగా అప్పుడప్పుడు చిత్రం తర్వాత కథ కోసం వెతుకుతున్న దర్శకుడు చంద్ర సిద్దార్థ్ కు మదన్ పరిచయం అయ్యారు. అంతే అక్కడి నుంచి స్టోరీ ఇంకో మలుపు తీసుకుంది. ఏళ్ళు గడిచిపోయేసరికి నిర్మాత మారారు. ప్రొడ్యూసర్ ప్రేమ్ కుమార్ వచ్చి చేరారు. ఫైనల్ వెర్షన్ విన్నాక రాజేంద్ర ప్రసాద్ కళ్ళలో నీళ్లు. అప్పటికప్పుడు డేట్లు లేకపోయినా అడ్జస్ట్ చేసి మరీ ఇచ్చారు. విపరీతమైన బిజీలో ఉన్న సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సైతం కాదనలేకపోయారు.

హీరోయిన్ గా తల్లి పాత్ర కోసం ఆమనిని తీసుకున్నారు. మహా పిసినారి పాత్రలో మరోసారి విశ్వరూపం చూపించేందుకు కోట శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. కేవలం 40 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేశారు చంద్రసిద్దార్థ్. 2004 డిసెంబర్ 9న తక్కువ సెంటర్లలో రిలీజ్ చేసినా పెద్దగా టాక్ లేదు. రెండు వారాల తర్వాత హౌస్ ఫుల్ బోర్డులు బయటకి వచ్చాయి. ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటే చనిపోయాక కూడా జీవితం ఎంతగా గొప్పగా ఉంటుందో చూపించిన తీరుకి చూసిన ప్రతి ఒక్కరు చెమ్మగిల్లిన కళ్ళతో అద్భుతం అనేశారు. కమర్షియల్ గానూ వసూళ్లు ఇచ్చారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు మొత్తం మూడు విభాగాల్లో నంది అవార్డులు కూడా సొంతం చేసుకుంది. భాగం పంచుకున్న ప్రతిఒక్కరికి ఆ నలుగురు గొప్ప సినిమాగా మిగిలిపోయింది

Also Read :  ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ లవ్ క్లాసిక్ ‘నిన్నే పెళ్లాడతా’ – Nostalgia

Show comments