iDreamPost
android-app
ios-app

సెయింట్ అగ‌స్టీన్‌లో ఒక సాయంత్రం

సెయింట్ అగ‌స్టీన్‌లో ఒక సాయంత్రం

జాక్స‌న్‌విల్లీకి గంట డ్ర‌యివ్ దూరంలో సెయింట్ అగ‌స్టీన్‌లో ఒక కోట వుంది. చిన్న‌దే కానీ చాలా చ‌రిత్ర వుంది. ప్ర‌పంచంలో ప్ర‌తి కోట గోడ‌లు సైనికుల ర‌క్తంతో త‌డిసే వుంటాయి. ఇది అదే.

ఇపుడు అది ఫ్లొరిడా రాష్ట్రంలో ఒక ఫేమ‌స్ టూరిస్ట్ ప్లేస్‌. ఆదివారం కాబ‌ట్టి ఓ 3 వేల మంది వ‌చ్చారు. క‌రోనా లేక‌పోతే కిట‌కిట‌లాడుతుంద‌ట‌. కొద్ది మంది మాత్ర‌మే మాస్క్‌లు వేసుకున్నారు. రెస్టారెంట్స్‌లో చేతులు శానిటైజ్ చేసేవాళ్లు, టెంప‌రేచ‌ర్ చూడ‌డం ఏమీలేదు. కేసులు ఎన్ని పెరిగినా అమెరికాలో భ‌యం పోయింది. కూల్‌గా పిల్లాపాప‌ల‌తో పిక్నిక్ వ‌చ్చారు. మాకు ఇండియాలోనే భ‌యం పోయింది.

ఇక్క‌డ అతి పెద్ద స‌మ‌స్య పార్కింగ్‌. కారులోనే 20 నిమిషాలు తిరుగుతూ వెతికితే దొరికింది. మిష‌న్ నోటికి ATM కార్డు అందిస్తే అది పార్కింగ్ టికెట్ ఇస్తుంది. మ‌నుషులుండ‌రు. అంద‌రూ రూల్స్ పాటిస్తారు. ఉల్లంఘిస్తే 100-250 డాల‌ర్ల వ‌ర‌కూ మొహ‌మాటం లేకుండా ఫైన్ వేస్తారు. నేను DSPమేన‌ల్లుడు, MLA త‌మ్ముని కొడుకు అంటే ఎవ‌రూ వ‌ద‌ల‌రు. బిల్‌క్లింట‌న్ అధ్య‌క్షుడిగా వున్న‌ప్పుడు ఆయ‌న కూతురికే ఫైన్ వేసారు.

కారు దిగ‌గానే వ‌రుస‌గా లిక్క‌ర్ బార్లు. అమెరిక‌న్లు బాగా మందు ప్రియులు. ఈ మ‌ధ్య ఒక లిక్క‌ర్ మాల్‌కి వెళితే అది మ‌న Dmartకి మూడు నాలుగింత‌లుంది. ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ కావ‌డానికి ఇది ఒక కార‌ణ‌మా? ఇదే కార‌ణ‌మా?

కోట ద‌గ్గ‌రికెళితే టికెట్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర ర‌ష్‌. లోప‌ల నుంచి ఎంత మంది బ‌యటికొస్తే , అంత మందినే పంపుతారు. కోట బ‌య‌ట దాని చ‌రిత్ర‌ని చిన్న‌చిన్న బోర్డుల్లో రాశారు. అది ఎపుడెపుడు ఎవ‌రి ఆధీనంలో వుంది, దాని గ‌వ‌ర్న‌ర్ పేరు ఇలాంటివి వుంటాయి.

పొట్ట‌కూటి కోసం ప‌నిచేసిన సైనికులు ఎంత మంది కోట ప‌క్క‌నున్న న‌దిలో శ‌వాలుగా తేలారో లెక్క‌లుండ‌వు. ఒక‌సారి ముట్ట‌డిలో కొన్ని వేల మంది నెల‌రోజులు కొట లోప‌లే వుండిపోయారు. తిండికి లేక ఎంత మంది చ‌చ్చిపోయారో పుస్త‌కాల్లో రాయ‌రు. కొన్ని వేల మంది న‌ల్ల‌బానిస‌లు ఈ న‌దిలోనే ర‌వాణా అయ్యారు.

సివిల్ వార్‌లో బానిస‌త్వానికి అనుకూలంగా ఫ్లొరిడా పోరాడింది. ఓడిపోయింది. ఈ యుద్ధంలో సెయింట్ అగ‌స్తీన్‌కి చాలా Importance వుంది. 1963లో న‌ల్ల‌వాళ్ల హ‌క్కుల కోసం ఇక్క‌డ తీవ్ర పోరాటం జ‌రిగింది. 1964లో మార్టిన్ లూధ‌ర్‌కింగ్ (జూనియ‌ర్‌) అరెస్ట్ జ‌ర‌గ‌డంతో ఉద్య‌మం తీవ్ర‌మై బ్లాక్స్ ఇళ్లు కాల్చేసారు. వంద‌ల మందిని జైళ్ల‌లో కుక్కారు. అగ‌స్టీన్‌లో జ‌రిగిన ద‌మ‌న‌కాండ తీవ్ర‌త అంత‌ర్జాతీయంగా ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. బ్లాక్స్ రాజ్యాంగ హ‌క్కులు రావ‌డం వెనుక ఈ సంఘ‌ట‌న ఒక Driving force.

ఆదివారం గ‌డ‌ప‌డానికి అన్ని జాతుల వాళ్లు వ‌చ్చారు. బ్లాక్స్‌, వైట్స్, చైనీస్ , ఇండియ‌న్స్‌, అర‌బ్స్‌. ఒక అర‌బ్ జంట ఏదో గొడ‌వ‌ప‌డుతూ కూడా క‌నిపించింది. మొగుడు పెళ్లాల గొడ‌వ ఏ భాష‌లో వున్నా దానికి అనువాదం అక్క‌ర్లేదు.

చాలా మంది కుక్క‌ల్ని కూడా తీసుకొచ్చారు. అక్క‌డ‌క్క‌డ కుక్క‌ల దాహం కోసం Bowls ఏర్పాటు చేశారు. మెక్సిక‌న్‌, ఇటాలియ‌న్‌, బ్రెజిల్ , చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు క‌నిపించాయి కానీ, ఇండియ‌న్ క‌న‌ప‌డ‌లేదు. త్రిభుజాకార‌పు పిజ్జా ముక్క తిన్నాను. చొక్కా మీద వేసుకోకుండా ఏదీ తిన‌లేను. ప‌ల్లెటూరి పేద‌రికం నుంచి వ‌చ్చిన అల‌వాటేమో! పిజ్జా మీదున్న చికెన్ ముక్క‌ల్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ తిన్నాను.

బ‌య‌ట కొంద‌రు పిల్ల‌లు సైకిళ్ల మీద షికార్లు కొడుతున్నారు. కోట ప‌క్క‌నున్న న‌దిలో ప‌డ‌వ షికారు ఒక పెద్ద ఆక‌ర్ష‌ణ‌. కొంద‌రు అమ్మాయిలు గుంపుగా ప‌డ‌వ‌లో పాట‌లు పాడుతున్నారు. వూరంతా తిప్పి చూపించే బ‌స్పులోని వాళ్లు ప్ర‌తిదీ ఒక వింత అన్న‌ట్టు ఆస‌క్తిగా చూస్తున్నారు.

టూరిస్టుల కోసం గుర్ర‌పు బ‌గ్గీలు (టాంగాలు) తిరుగుతున్నాయి. కొన్నింటికి ఒక‌టి, మ‌రికొన్నింటికి రెండు గుర్రాలున్నాయి. ఏ దేశంలోనైనా గుర్రానికి కంత‌లు క‌ట్టాల్సిందే. చాలా బ‌లిష్టంగా వున్నాయి. దాన్ని చూస్తే చిన్న‌ప్పుడు జ‌ట్కా తోలే కుంటి మార‌న్న గుర్తుకొచ్చాడు. బ‌క్క గుర్రంలాగే ఎండిన డొక్క‌ల‌తో వుండేవాడు. ఒక‌రోజు గుర్రానికి జ‌బ్బు చేసి చ‌నిపోయింది. బ‌త‌క‌లేక ఇంటి ముందున్న వేప‌చెట్టుకి వురేసుకుని చ‌నిపోయాడు. ఆ చెట్టుని అత‌నే నాటాడు, రోజూ నీళ్లుపోసి పెంచాడు.

ఇంకొకాయ‌న వ‌లీసాబ్‌. చిన్న‌ప్పుడు ఆయ‌న జ‌ట్కాలో ఎక్కితే గుర్రం జారిప‌డింది. నాకూ మా చెల్లెలికి గాయాలు త‌గిలి ర‌క్త‌మొచ్చింది. గుర్రాన్ని పైకి లేపుతూ వ‌లీసాబ్ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. న‌న్ను సాక‌డానికి మా నాన్న వున్నాడు. వ‌లీసాబ్‌, అత‌ని న‌లుగురు పిల్ల‌ల్ని సాక‌డానికి గుర్రం త‌ప్ప ఎవ‌రూ లేరు. రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మాజ్ చేసే వ‌లీసాబ్ త‌న జీవితంలో స‌గ‌భాగం రాయదుర్గంలోని వెంక‌టేశ్వ‌ర‌స్వామి గుడికి భ‌క్తుల్ని తోలుతూ గ‌డిపాడు. అదే విచిత్రం.

ఒక సందులో ఒకాయ‌న వ‌యోలిన్ వాయిస్తున్నాడు. తీగె మీద ఏదో దుక్కం ప్ర‌యాణిస్తున్న‌ట్టుంది. డ‌బ్బుల‌డ‌గ‌డు, ఇవ్వాల‌నుకుంటే ఆయ‌న ఎదురుగా వున్న బౌల్‌లో వేయ‌చ్చు.

ఇంకో చోట Home less ముగ్గురు క‌నిపించారు. ఒక ప్ల‌కార్డ్‌లో Home less, Please Donate, God saves you అని రాసి ముందు పెట్టుకున్నారు. ఒకాయ‌న‌కి 50 ఏళ్ల వ‌య‌సుంటుంది. శూన్యంలోకి చూస్తూ సిగ‌రెట్ తాగుతున్నాడు. ఈ చ‌లికి ఇల్లు లేకుండా ఎలా వుంటాడో! అమెరికాలోని పేద‌రికం బ‌య‌టికి క‌న‌ప‌డ‌దు. గుంభ‌నంగా వుంటుంది.

పేద‌రికాన్ని చూసి చూసి విసిగిపోయి మార్క్స్ ఒక మందుని క‌నిపెట్టాడు. దాని పేరు మార్క్సిజం. ఆయ‌న క‌ల‌ని లెనిన్ నిజం చేశాడు. అంద‌రూ క‌డుపు నిండా అన్నం తిందాం అన్నారు. కానీ మ‌న‌కి ద్వేషించ‌డానికి ఒక మ‌నిషి కావాలి. అసూయ ప‌డ‌డానికి ఒక విష‌య‌ముండాలి. మ‌నం తిన‌క‌పోయినా ప‌ర్వాలేదు. అంద‌రమూ తింటే మ‌న‌సొప్ప‌దు.

ఖ‌రీదైన కారులో పేద‌వాళ్ల గురించి ఆలోచిస్తూ తిరిగొచ్చాను. మ‌న దేశంలో డూప్ మేధావులు, దొంగ మార్క్సిస్టుల ప్రాథ‌మిక ల‌క్ష‌ణమిది. ఇండియాలో లేదు కానీ అమెరికాలో ఈ విద్య నాకు అబ్బిన‌ట్టుంది.